ప్యాట్ కమిన్స్ (ఫైల్ ఫొటో)
ముంబై : ఐపీఎల్-11 సీజన్‌లో ఢిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నుముక గాయంతో ఆ జట్టు స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మొత్తం టోర్నీ నుంచే నిష్క్రమించాడు. ఈ సీజన్ వేలంలో ఈ ఆసీస్ ఆటగాడిని ముంబై 5.4 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.
అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిటెస్టులో కమిన్స్ వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడ్డాడని, వైద్యపరీక్షలు నిర్వహించగా అతని వెన్నుపూసలో ఎముకకు గాయమైనట్లు తేలిందని ఆస్ట్రేలియా జట్టు ఫిజియో డేవిడ్ బేక్లీ తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో కమిన్స్ బౌలింగ్ చేయకపోవడమే మంచిదని, లేకుంటే గాయం తీవ్రమయ్యే ప్రమాదముందన్నాడు. ఈ నేపథ్యంలోనే అతను ఐపీఎల్ నుంచి నిష్క్రమించడమే ఉత్తమమని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం కమిన్స్ కోలుకుంటున్నాడని, త్వరలో మళ్లీ రీస్కాన్ చేసి అతను ఇంగ్లండ్ పర్యటనలో పర్యటించేది లేనిది ప్రకటిస్తామని డేవిడ్ తెలిపాడు. గత శనివారం చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌ను సైతం కమిన్స్ ఆడలేదు. ఈ మ్యాచ్‌లో విఫలమైన మెక్లిన్‌గన్ స్థానంలో కమిన్స్‌ను ఆడించాలని భావించిన రోహిత్ సేనకు నిరాశే ఎదురైంది.
ఇక జూన్‌లో ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, ఒక టీ20ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇప్పటికే బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు ఆస్ట్రేలియా జట్టును కలవర పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment