విరాట్ సేనపైనే ఒత్తిడి ఉంది
రాంచీ: టీమిండియాపైనే ప్రస్తుతం ఒత్తిడి ఉందని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అన్నాడు. టెస్టు సిరీస్ ప్రారంభంకాక ముందు తాము 0-4 తేడాతో ఓడిపోతామని, తమ జట్టులో అనుభవంలేని యువ ఆటగాళ్లు ఉన్నారని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారని చెప్పాడు. వారి అంచనాలు తప్పయ్యాయని అన్నాడు. భారత్-ఆసీస్‌ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. మరో రెండు టెస్టులు రాంచీ, ధర్మశాలలో జరుగుతాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెంగళూరు నుంచి రాంచీ వెళ్లారు.
తొలి టెస్టులో తాము సత్తాచాటి విజయం సాధించామని, రెండో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వెళ్లామని నాథన్ చెప్పాడు. చివరి రెండు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ సేనను ఎదుర్కోవడంపై దృష్టిసారిస్తున్నామన్నాడు. స్పిన్‌కు అనుకూలించే ఇక్కడి పిచ్‌లపై తాను బౌలింగ్‌లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లలో పిచ్ స్పిన్‌కు అనుకూలించిందని చెప్పాడు.