హెరాత్.. ఇరగదీశాడు!
కొలంబో: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ వ్యక్తిగతంగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. 12.75 బౌలింగ్ సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. మూడు టెస్టుల సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ గా రికార్డు కెక్కాడు. మూడో ప్రపంచ బౌలర్ గా నిలిచాడు. హెడ్లీ(న్యూజిలాండ్) 33, హర్భజన్ సింగ్(భారత్) 32 అతడి కంటే ముందున్నారు. ముత్తయ్య మురళీధరన్ కూడా 28 వికెట్లు పడగొట్టాడు. ఇందుకు ముళీధరన్ 1255 బంతులు తీసుకోగా, హిరాత్ 870 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు.
ఆస్ట్రేలియాతో పల్లెకెలెలో జరిగిన మొదటి టెస్టులో 9, గాలెలో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టాడు. చివరి మ్యాచ్ లో సంచలనాత్మక బౌలింగ్ తో 13 వికెట్లు నేలకూల్చాడు. తొలి ఇన్నింగ్స్ 6, రెండో ఇన్నింగ్స్ లో 64 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీశాడు. హిరాత్ ఇంతకుముందు కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 2014లో పాకిస్థాన్ జరిగిన రెండు టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. స్వల్పకాలంలోనే రికార్డులు తిరగరాస్తున్న అతడి పూర్తి పేరు.. హెరాత్ ముదియాన్సెలగే కీర్తి బండార హెరాత్.