ఫెడరర్... ఈసారి అలవోకగా
≈ 16వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి స్విస్ స్టార్
≈ నాదల్, థీమ్ కూడా ముందంజ
≈ యూఎస్ ఓపెన్ టోర్నీ
న్యూయార్క్: తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదు సెట్‌లపాటు పోరాడి గెలిచిన రోజర్ ఫెడరర్ ఈసారి మాత్రం వరుస సెట్‌లలో విజయాన్ని దక్కించుకున్నాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో 16వ సారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–3, 7–5తో 31వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై గెలుపొందాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫిలిప్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)తో ఫెడరర్ తలపడతాడు. కోల్‌ష్రైబర్‌తో ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 11–0తో ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు టాప్ సీడ్ నాదల్ (స్పెయిన్), ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో నాదల్ 6–7 (3/7), 6–3, 6–1, 6–4తో మాయెర్ (అర్జెంటీనా) పై, థీమ్ 7–5, 6–3, 6–4తో మనారినో (ఫ్రాన్స్)పై విజయం సాధించారు.
18వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 7–5, 5–1తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్‌ఫిల్స్ గాయం కారణంగా వైదొలిగాడు. రద్వాన్‌స్కా అవుట్: మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) మూడో రౌండ్‌లో నిష్క్రమించారు. కోకో వాండెవాగె (అమెరికా) 7–5, 4–6, 6–4తో రద్వాన్‌స్కాపై, కసత్‌కినా (రష్యా) 6–3, 6–2తో ఒస్టాపెంకోపై గెలిచారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 7–5తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై, 15వ సీడ్ కీస్ (అమెరికా) 2–6, 6–4, 6–1తో వెస్నినా (రష్యా)పై గెలిచారు.