'ధోనీ అప్పుడే రిటైర్‌ అయితే బాగుండేది' | Shoaib Akhtar Comments About MS Dhoni Retirement | Sakshi
Sakshi News home page

'ధోనీ అప్పుడే రిటైర్‌ అయితే బాగుండేది'

Published Sun, Apr 12 2020 6:28 PM | Last Updated on Sun, Apr 12 2020 6:28 PM

Shoaib Akhtar Comments About MS Dhoni Retirement - Sakshi

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈ మధ్యన తరచూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. కరోనాపై పోరాటానికి నిధుల సమీకరణ కోసం భారత్​, పాక్ మధ్య మ్యాచ్​లు నిర్వహించాలని చెప్పి.. పలువురి ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు. ఈ అంశాన్ని ధోనీ ఎక్కువకాలం సాగదీయకుండా ఉంటే బాగుంటుందని అక్తర్ తెలిపాడు. 'ధోనీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి భారత క్రికెట్​కు సేవలు అందించాడు. ఇక ఆటకు గౌరవంతో వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసింది. అయితే ధోనీ ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు సాగదీస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాతే అతడు రిటైరవ్వాల్సింది. ఒకవేళ నేను అతడి స్థానంలో ఉంటే అప్పుడే ఆటకు వీడ్కోలు పలికేవాడిని. 2011 ప్రపంచకప్‌ తర్వాత ఇక ఆడకూడదరి నిర్ణయించుకొని నేను క్రికట్‌కు వీడ్కోలు పలికాను. ఆ తర్వాత ఎప్పుడు బ్యాట్‌ పట్టలేదు. కానీ ఇండియాకు రెండు ప్రపంచకప్​లు అందించడంలో కీలక పాత్ర పోషించిన ధోనికి వారి దేశం ఎంతో గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉంది.(‘ఇమ్రాన్‌ కంటే భారత్‌ గురించే ఎక్కువ తెలుసు’)

ఒకవేళ ఐపీఎల్‌ 2020 జరిగి ఉంటే.. అందులో ధోని మంచి ప్రదర్శన కనబరిచి ఉంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండేవాడు. నా దృష్టిలో 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌తోనే ధోని ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. అయితే ప్రపంచకప్ తర్వాతనైనా.. వీడ్కోలు సిరీస్ ఆడి, గౌరవంగా తప్పుకోవాల్సింది. ఇక మాములు సిరీస్‌ల్లో అదరగొడుతున్న కోహ్లీ సేన.. ఐసీసీ టోర్నీ‌ల్లో విజేతగా నిలవకపోవడానికి మిడిలార్డ‌ర్‌లో మ్యాచ్ విన్నర్స్ లేకపోవడమే కారణం. టోర్నీ విజేతలుగా నిలవడం ఒక విషయమైతే.. అగ్ర జట్టుగా కొనసాగడం మరో విషయం. టెస్ట్‌ల్లో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. పరిమిత ఓవర్లలో కూడా టాప్ టీమ్స్‌లో ఒకటిగా ఉంది. కేవలం ఐసీసీ ఈవెంట్ల ఫలితాల ఆదారంగా వారి ప్రదర్శనపై ఓ అంచనాకు రాకుడదు. అదే సమయంలో ఐసీసీ ఈవెంట్స్ కూడా వారు గెలవాల్సిందే. టాప్-4 చెలరేగితో ఆ జట్టుకు తిరుగుండదు. కానీ ఎప్పుడో ఒకసారి విఫలమైతే మాత్రం ఫలితం వేరేలా ఉంటుంది. వారి సమస్యే అదే. అలాగే ధోనీ, యువరాజ్ సింగ్ వంటి ఫినిషర్స్ మిడిలార్డర్‌లో ఉంటే.. ఫలితం వేరేలా ఉంటుంది. సమస్యంతా మిడిలార్డర్‌లో ఫినిషర్స్ కొరత వల్లే ' అంటూ అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుత కరోనా బీభత్సం ఇలాగే కొనసాగితే మరో 6-8 నెలలు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఉండవన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ కూడా జరిగే అవకాశం లేదని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. (16 ఏళ్లయినా ఆ రికార్డును కొట్టలేకపోయారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement