ఇద్దరు ఖరారు... ముగ్గురు  తకరారు! | Special story to team india young cricketers | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఖరారు... ముగ్గురు  తకరారు!

Published Tue, Oct 16 2018 12:16 AM | Last Updated on Tue, Oct 16 2018 1:20 PM

Special story to team india young cricketers - Sakshi

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ టీమిండియాలోని ఐదుగురు ఆటగాళ్లు ప్రతిభ చాటుకునేందుకు వేదికవుతుందని భావిస్తే, అందులో ఇద్దరికే నికరంగా అవకాశాలు దక్కాయి. ఇందులో అప్పటికే మూడు టెస్టులాడిన రిషభ్‌ పంత్‌ ఒకరైతే... టీనేజ్‌ ఓపెనర్‌ పృథ్వీ షా రెండో వాడు. వీరిద్దరు అదరగొట్టేసి ఆస్ట్రేలియా పర్యటనకు తమ బెర్త్‌లను ఖాయం చేసేసుకున్నారు. మిగిలిన ముగ్గురికి ఇప్పటికి నిరీక్షణ, రాబోయే సిరీస్‌కు ఊరింపు రెండూ మిగిలాయి. మరి, వారికి మున్ముందైనా పిలుపొస్తుందా? జట్టులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమేం సవాళ్లు ఎదురుకానున్నాయి...? ఓసారి పరిశీలిస్తే..?  

సాక్షి క్రీడా విభాగం : యువ సంచలనం పృథ్వీ షా సత్తా ఏమిటో, రిషభ్‌ పంత్‌ దూకుడులో నిలకడెంతో వెస్టిండీస్‌ సిరీస్‌ ప్రపంచానికి తెలిపింది. ఇదే క్రమంలో వీరిద్దరికీ వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో చోటు ఖాయమైంది. వాస్తవంగా చెప్పాలంటే... అనుభవజ్ఞులైన ప్రత్యామ్నాయ ఆటగాళ్లుండటం, వారి దారులింకా మూసుకుపోకపోవడంతో వీరి స్థానాలకు విండీస్‌తో సిరీస్‌కు ముందువరకు పూర్తిగా భరోసా లేని పరిస్థితి. కానీ, అనూహ్య అవకాశమే అయినా, రెండు చేతులా అందిపుచ్చుకుని 237 పరుగులు బాదిన పృథ్వీ, వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో 92 పరుగులతో పంత్‌... ఆసీస్‌ సిరీస్‌కు మొదటి ప్రాధాన్యంగా తమను కాదనలేని పరిస్థితి కల్పించారు. ఇక, హనుమ విహారిని రెండు టెస్టుల్లోనూ ఆడించకపోవడానికి జట్టు కూర్పు కారణం కాగా, మయాంక్‌ అగర్వాల్, మొహమ్మద్‌ సిరాజ్‌లు నిరీక్షణ జాబితాలో మరికొంత కాలం ఉండక తప్పేలా లేదు. 

ఆరంభం... అతడితోనే 
ఒక్క సిరీస్‌ వ్యవధిలో భారత టెస్టు ఓపెనింగ్‌ స్వరూపమే మారిపోయింది. సీనియర్లు శిఖర్‌ ధావన్, మురళీ విజయ్‌ మధ్య చోటే దక్కని లోకేశ్‌ రాహుల్‌ ఒక స్థానాన్ని భర్తీ చేసేయగా, కుర్రాడు పృథ్వీ రెండో స్థానాన్ని అమాంతం ఆక్రమించేశాడు. అందరూ మయాంక్‌ గురించి ఆలోచిస్తుంటే అవకాశం మాత్రం ముంబైకర్‌ను వరించింది. టెక్నిక్‌ పరంగా ధావన్, వయసు, ఫామ్‌రీత్యా విజయ్‌ మళ్లీ రావడం కష్టమే. ఈ నేపథ్యంలో ఆసీస్‌ సిరీస్‌కు రాహుల్‌కు జత పృథ్వీనే అని స్పష్టమైపోతోంది. ఈ టీనేజర్‌పై ఆదివారం రెండో టెస్టు ముగిసిన అనంతరం కోచ్‌ రవిశాస్త్రి పొగడ్తలు చూసినా ఇదే విషయం చెప్పొచ్చు. అయితే, పృథ్వీకి ఆస్ట్రేలియా సిరీస్‌ అసలైన పరీక్ష కానుంది. ఇన్నాళ్లూ దేశవాళీల్లో, విదేశాల్లో భారత్‌ ‘ఎ’ తరఫున అదరగొట్టిన అతడు... పేస్‌కు పెట్టింది పేరైన కంగారూ పిచ్‌లపై కంగారు పడకుండా ఎలా ఆడతాడో చూడాలి. ప్రతిభ, దృక్పథం, టెక్నిక్, దూకుడు కలబోత అయిన ఈ యువ సంచలనం సవాళ్లను అధిగమిస్తే టీమిండియా ఓపెనింగ్‌ సమస్య తీరినట్లే. 

సాహా వచ్చినా... పంత్‌కే! 
వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు చేజార్చుకున్నా... టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వద్ద అంతకుమించిన స్కోరు కొట్టేశాడు పంత్‌. గాయం నుంచి కోలుకుని రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అందుబాటులోకి వచ్చినా, ఆసీస్‌ పర్యటనలో ప్రథమ ప్రాధాన్యం పంత్‌కేననడంలో సందేహం లేదు. ఈ పోటీని రవిశాస్త్రి ‘సానుకూలాంశం’ అని చెప్పినా... వికెట్ల వెనుక చురుగ్గా ఉండటం మినహా పంత్‌ను కాదనేంతగా సాహా రికార్డులు ఘనంగా లేవు. నిదానంగా ఆడే 33 ఏళ్ల సాహా కంటే... దూకుడైన 21 ఏళ్ల పంత్‌నే కోహ్లి కోరుకుంటాడు. అయితే,  సాహాను రెండో కీపర్‌గా తీసుకోవచ్చు. పంత్‌ తీవ్రమైన తప్పిదాలు చేస్తేనే సాహా పునరాగమనం మనం చూడొచ్చు. 

మయాంక్‌... మరికొంతకాలం 
తుది జట్టులోకి రావడానికి ఆఖరి మెట్టుపై ఉన్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ మరికొంత కాలం వేచి చూడక తప్పదు. కూర్పురీత్యా మిగతా ఏ స్థానాలూ ఖాళీగా లేనందున... పృథ్వీ, రాహుల్‌ ఆసీస్‌ గడ్డ మీద వరుసగా విఫలమై వారిపై మేనేజ్‌మెంట్‌కు విశ్వాసం తగ్గితేనే ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ అరంగేట్రం సాధ్యమవుతుంది. ఎలాగూ నాలుగో ఓపెనర్‌ గురించి చర్చ లేదు. అందుబాటులో ఉన్న మూడో, మెరుగైన ప్రత్యామ్నాయం మయాంకే. మరికొద్ది రోజుల్లో మయాంక్‌ భారత్‌ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌ గడ్డపై సిరీస్‌ ఆడటం ఖాయం. ఆస్ట్రేలియా తరహా పిచ్‌లు ఉండే న్యూజిలాండ్‌లో రాణిస్తే అతనికి చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక స్వతహాగా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కావడం, ఆఫ్‌ స్పిన్‌ నైపుణ్యం కారణంగా... హనుమ విహారికి ఆస్ట్రేలియాలో తన రెండో టెస్టు ఆడే అవకాశం కనుచూపు మేరలో మిణుకుమిణుకు మంటోంది. అది కూడా, బ్యాట్‌తో పంత్‌ విఫలమై, కోహ్లి ఆరుగురు బ్యాట్స్‌మన్‌ కూర్పు వైపు మొగ్గు చూపితేనే! అప్పటికీ ఆల్‌రౌండర్‌ కోటాలో హార్దిక్‌ పాండ్యా, అశ్విన్, జడేజా పోటీ వస్తారు. ముఖ్యంగా జడేజా ఫామ్‌లో ఉండటం... విహారికి ప్రతిబంధకం అవుతుంది. ఇవేవీ కాకుండా గాయాల వంటి అనుకోని పరిస్థితులు ఎదురై, ఓ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అవసరమైతే మొగ్గు కచ్చితంగా ఈ ఆంధ్ర ఆటగాడి వైపే ఉంటుంది. 

సిరాజ్‌... ఆరో బౌలర్‌! 
ఇషాంత్, షమీ, భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్‌... ఈ ఐదుగురితో టీమిండియా పేస్‌ దళం పటిష్ఠంగా ఉందనుకుంటే తానున్నానంటూ దూసుకొచ్చాడు హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌. అతడికి తోడుగా శార్దూల్‌ ఠాకూర్‌. ఇంత పోటీలో సిరాజ్‌ టెస్టు అరంగేట్రం ఇంకొంత దూరం జరిగింది. సమయం ఉన్నందున ఇషాంత్, శార్దుల్‌ ఫిట్‌నెస్‌ సమస్యలను అధిగమించొచ్చు. దీంతో టాప్‌–5 పేసర్లు ఆసీస్‌ పర్యటనకు సిద్ధంగా ఉంటారు. శార్దుల్‌ ఎంపికపై పెద్దగా ఆశల్లేకున్నా, సిరాజ్‌కు మాత్రం ఈ పరిస్థితుల్లో చోటు కష్టమే. ప్రధాన పేసర్‌ ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఈ హైదరాబాదీకి పిలుపు రావొచ్చు. హైదరాబాద్‌ టెస్టులో శార్దుల్‌ గాయంతో మొదట్లోనే వైదొలగడంతో... అతడి బదులు సిరాజ్‌నే ఆడిస్తే బాగుండేదని చాలామంది భావించారు. ఇటీవలి ఫామ్‌రీత్యా, పేస్‌కు అనుకూలించిన పరిస్థితుల్లో సొంతగడ్డపై అతడు కచ్చితంగా ప్రతాపం చూపి ఉండేవాడు. ఓ అద్భుత అరంగేట్రం చేజారిన సిరాజ్‌ ఆసీస్‌ పర్యటన... కాలంపైనే ఆధారపడి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement