సాక్షి ముంబై: క్లీన్-అప్ మార్షల్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగర శుభ్రత కోసం నియమించిన క్లీన్-అప్ మార్షల్ సిబ్బంది ముంబైకర్లపై దాదాగిరి చేస్తున్నారని అన్ని పార్టీల సభ్యులు బుధవారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో ఆరోపించారు.దీంతో ఈ పథకాన్ని బీఎంసీ మళ్లీ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరిమానా విధిస్తామంటూ బెదిరించి ముంబైకర్లను మార్షల్స్ లూటీ చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని సభ్యులు పేర్కొన్నారు. ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు ఈ పథకాన్ని రద్దు చేశారు. ఐదు నెలల క్రితం మళ్లీ ప్రారంభించారు. సార్వజనీక పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న వారికి, అక్కడికక్కడే జరిమానాలు విధించడం ద్వారా నగరంలో పారిశుద్ధ్యాన్ని పటిష్టపరచవచ్చనే ఆలోచనతో 2007లో బీఎంసీ ‘క్లీన్-అప్ మార్షల్’ పేరిట పథకం ప్రవేశపెట్టింది.
అయితే దీనివల్ల ఎటువంటి ప్రయాజనం కనిపించడం లేదని, పెపైచ్చు మార్షల్స్ దాదాగిరి చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యురాలు శీతల్ మాత్రే స్థాయీ సమితికి సోదాహరణంగా ఫిర్యాదుచేశారు. దహిసర్‌లో సొసైటీ బయట చెత్త వేయరాదని బోర్డు ఏర్పాటుచేసిన వ్యక్తుల నుంచి రూ.10 వేల జరిమానా వసూలు చేస్తున్నారని, జరిమానా విధించలేని చిన్న పిల్లలతో పనిచేయించుకుంటున్నారని, చర్యలు తీసుకోకుండా ఉండేందుకు దుకాణదారుల నుంచి రూ.ఐదు వేలు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇదిలా వుండగా క్లీన్-అప్ మార్షల్స్ విధానంపై మొదటినుంచి వివాదాలు కొనసాగుతున్నాయని స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే తెలిపారు. ఈ పథకం విషయమై వారం రోజుల్లో ఒక నివేదిక తయారుచేయాలని పరిపాలన విభాగానికి ఆదేశించామన్నారు. అనంతరం పథకాన్ని రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
‘క్లీన్ అప్’కు చరమగీతం!
Published Fri, Aug 16 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement