దిగిరాని ఉల్లి ప్రత్యేక ఔట్‌లెట్ల ద్వారా అమ్మకం
Published Fri, Aug 16 2013 11:56 PM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రోడ్లు ధ్వంసం కావడం వల్ల గణనీయంగా పెరిగిన ఉల్లి ధరలను తగ్గించడానికి షీలా దీక్షిత్ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రత్యేక దుకాణాల్లో వీటిని తక్కువ ధరలకు అమ్మడంతోపాటు, విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలో కిలో ఉల్లి రూ.80 వరకు పలుకుతోంది.
న్యూఢిల్లీ: సామాన్యుడిని వణికిస్తున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. కిలో రూ.55కే ఉల్లిగడ్డలను విక్రయించడానికి వీలుగా ఢిల్లీలో శనివారం నుంచి ప్రభుత్వం వెయ్యి ప్రత్యేక ఔట్‌లెట్లను ప్రారంభిస్తోంది. వీటికితోడు 600 సంచార వాహనాల ద్వారా కూడా ఉల్లిపాయలు విక్రయిస్తారు. ‘లాభనష్టాలు లేని ధరలకు ఉల్లిని అమ్ముతాం. ఇందుకోసం నగరవ్యాప్తంగా వెయ్యి ప్రత్యేక దుకాణాలను తెరుస్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి హరూన్ యూసుఫ్, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి డీఎం సోలియా, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) చైర్మన్ బిజేందర్‌సింగ్, ఇతర సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఉల్లిసాగు లేకపోవడంతోపాటు, ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రోడ్లు ధ్వంసం కావడం వల్ల వీటి సరఫరా గణనీయంగా పడిపోయిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
వీటికితోడు స్వాతంత్య్ర దినోత్సవాలను దృష్టి లో ఉంచుకొని ఢిల్లీవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధిం చడంతో ఉల్లిట్రక్కులు నగరంలోకి ప్రవేశించలేదు. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఢిల్లీ మార్కెట్లలో కిలో ఉల్లి టోకు ధర రూ.50 వరకు ఉండగా, చిల్లర దుకాణాల్లో రూ.80 వరకు అమ్ముతున్నారు. ధరల పెరుగుదలపై ఓ కన్నేసి ఉంచాలని షీలా దీక్షిత్ సంబంధిత శాఖలను ఆదేశించారు. ఉల్లితోపాటు నిత్యావసరాలైన పప్పు లు, చక్కెర, టమాటాలు, ఆలుగడ్డలు అంతటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉల్లిని అక్రమంగా దాచి, అధిక ధరలకు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.55కు కిలో అమ్ముతాం: నాఫెడ్
ఉల్లి సరఫరాలను మెరుగుపర్చడం, అధిక ధరలను అడ్డుకోవడానికి వీలుగా దిగుమతులను ఆశ్రయిం చాలని నాఫెడ్ నిర్ణయించింది. నగరంలోని తమ ఐదు దుకాణాలు, రెండు సంచార వాహనాల్లో కిలో ఉల్లిపాయలు రూ.55కే అమ్ముతున్నామని నాఫెడ్ అధికారులు తెలిపారు. విదేశాల నుంచి ఉల్లి దిగుమతుల కోసం వచ్చే వారం టెండర్లను ఆహ్వానిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉల్లి సరఫరాలను పెంచడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం టన్ను ఉల్లి కనీస ఎగుమతి ధరను 650 డాలర్లు (దాదాపు రూ.39 వేలు)గా నిర్ణయించింది. ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కూడా నాఫెడ్‌ను ఆదేశించింది. దీంతో పాక్, ఇరాన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉల్లి ధరలను నాఫెడ్ పరిశీలిస్తోంది. శనివారానికల్లా పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరిస్తామని నాఫెడ్ వర్గాలు తెలిపాయి. ఉల్లి ఉత్పత్తి అధికంగా ఉండే మహారాష్ట్ర నాసిక్‌లోనూ వీటి కిలోటోకు ధర రూ.44కు చేరింది. ఇక ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీ లో టోకు ధర రూ.55 వరకు ఉంది. ఇక్కడికి శుక్రవారం 12 వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చినా, ధరల్లో మాత్రం మార్పు కనిపించలేదు. భయాందోళనల కారణంగా ధరలు తగ్గడం లేదని ఆజాద్‌పూర్ మండీ వ్యాపారులు అంటున్నారు.
Advertisement
Advertisement