ఉల్లిధర మళ్లీ భగ్గుమంది
Published Tue, Sep 17 2013 10:56 PM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఉల్లిధర మళ్లీ భగ్గుమంది. సామాన్యుడితో పాటు సర్కార్‌కు కన్నీళ్లు తెప్పిస్తోంది. నగరంలో కిలో ఉల్లి రిటైల్ ధర రూ.70 నుంచి రూ.80 లకు చేరడంతో సామాన్యులు కొనుగోలు చేసేందుకు వెనకడుగువేస్తున్నారు. ఒకప్పుడు భారీ మొత్తంలో ఉల్లి కొనేవారు ఇప్పుడు కిలో నుంచి రెండు కిలోలు మాత్రమే తీసుకెళ్లేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. కాగా దీని ప్రభావం నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పడుతుందేమోనని షీలా సర్కార్ భయపడుతోంది. ధర తగ్గుముఖం పట్టడంతో ఆదివారం నుంచి చౌక రేట్లకు ఉల్లి విక్రయాన్ని నిలిపివేసిన సర్కార్ ఆ కేంద్రాలను మళ్లీ తెరిపించే ప్రయత్నం చేస్తోంది. అయితే చౌక ధరకు విక్రయించే ఉల్లిని కూడా కిలో అరవై రూపాయలకన్నా తక్కువ ధరకు విక్రయించలేమని వ్యాపారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. నాసిక్ మార్కెట్ లోకి ఉల్లిరాక తగ్గిందని, అక్కడ మార్కెట్‌లోనే క్వింటాల్ ఉల్లి రూ.5,700 పలుకుతోందని వారు అంటున్నారు. దీనివల్ల దేశమంతటితో పాటు నగరంలో ఉల్లిపాయల ధరలు పెరిగాయని వారు చెబుతున్నారు.
గతంలో మార్కెట్‌కు వచ్చేవారు కనీసం ఐదు కిలోల ఉల్లిని కొనేవారని, కానీ వారిప్పుడు కిలో, రెండు కిలోలకు మించి కొనుగోలు చేయడం లేదని ఓఖ్లా మండీ వ్యాపారులు చెప్పారు. మార్కెట్లో అతి ఎక్కువ ధర పలుకుతోంది ఉల్లిపాయలేనని ఆ మార్కెట్‌కు వచ్చిన నీరజా వర్మ అనే గృహిణి చెప్పారు. పండుగల సీజన్‌లో ఉల్లి ధర ఎక్కువగా ఉంటుందని, దీపావళి వరకు ఉల్లి ధర తగ్గకపోవచ్చని రామ్ ధన్ అనే ఆజాద్‌పుర్ మండీ హోల్‌సేల్ డీలర్ చెప్పారు.
ఉల్లి ధరలు చరిత్రను పునరావృతం చేస్తాయోమోనన్న భయం కాంగ్రెస్ సర్కార్‌కు పట్టుకుంది. దీంతో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం ఏర్పాటుచేసి ఉల్లిని తక్కువ ధరకు ప్రజలకు అందించే విషయమై చర్చించారు. 15 ఏళ్ల క్రితం తనకు అధికారం చేజిక్కడానికి ఉపయోగపడిన కారణాలలో ఉల్లి ధర కూడా ఒకటని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే విధానసభ ఎన్నికలు జరగనున్న ఈ ఏడాది ఉల్లి ధర సామాన్యుడిని బాధించకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఉల్లిని తక్కువ ధరకు విక్రయించడానికి అనేక ఏర్పాట్లు చేసింది.
అయినా దేశవ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతోన్న ఉల్లి ధర ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలపై నీళ్లు చల్లుతోంది. వర్షాల కారణంగా నాసిక్ మార్కెట్‌కు ఉల్లి రాక తగ్గింది. ప్రస్తుతం నగరానికి ఉల్లి హుబ్లీ నుంచి వస్తోందని, అక్కడ కూడా వానలు కురుస్తుండడంతో ఉల్లి రాక తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసేవారు ఎక్కువయ్యార ని, డీజిల్ ధర పెరగడం కూడా ఉల్లి ధర పెరుగుదలకు కారణమని వారు చెబుతున్నారు. అక్టోబర్ 15 తర్వాత కొత్త పంట వస్తుందని ఆ తర్వాత ఉల్లి ధర తగ్గవచ్చని వ్యాపారులు అంటున్నారు. ఢిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో హోల్‌సేల్ ధర కేజీకి రూ.60లు పలికింది. దీంతో వీధి వ్యాపారులు రూ.70లకు ఉల్లిని విక్రయిస్తున్నారు.
వచ్చే నెలలో అదుపులోకి వస్తాయి: థామస్
న్యూఢిల్లీ: రిటైల్ మార్కెట్‌లలో పెరిగిన ఉల్లి ధరలు వచ్చే నెలలో అదుపులోకి వస్తాయని ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి ఉల్లి సరఫరా పెరుగుతుందని ఆయన తెలిపారు. ఉల్లిగడ్డ అక్రమంగా నిల్వ చేసిన వారిపై దాడులు చేయాలని ఇప్పటికే మహారాష్ట్రను కేంద్రం కోరిందని తెలిపారు. ‘సాధారణంగా జూన్, ఆగస్టు మధ్యలో ఉల్లి ధరలు పెరుగుతాయి. అయితే ఉల్లిగడ్డ పండించే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఆ పంట నాశనమయ్యింద’ని చెప్పారు. ఈ నెలాఖరులో, వచ్చే నెల మొదటివారంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉల్లి పంట చేతికి వస్తుందని, ఫలితంగా ధరలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement