ఉల్లి కేజీకి రూ.70కి చేరిన వైనం
Published Fri, Aug 23 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
న్యూఢిల్లీ: వంటింటి మహారాణులకు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ధరలు ఎప్పుడెప్పుడు దిగుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్న నగరవాసులకు ఉల్లి మరింత ఘాటెక్కిస్తోంది. గృహిణుల నుంచి బడా హోటళ్ల వరకు వంటకాల్లో అవసరమైన ఈ ఉల్లి ధర రోజురోజుకు పెరుగుతుంటే వినియోగదారులు హడలెత్తిపోతున్నారు. సామాన్యుల పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. వాటి మొహం చూసేందుకు కూడా భయపడుతున్నారు. నగరంలోని రిటైల్ మార్కెట్‌లలో గురువారం ఉల్లి కేజీకి రూ.70ల వరకు పలికింది. వీధి వ్యాపారులు ఆయా ప్రాంతాలను బట్టి రూ.55 నుంచి రూ.70ల వరకు విక్రయించారు.
ఉల్లిగడ్డల నాణ్యతను బట్టి వివిధ ధరలకు అమ్మారు. ఉల్లిగడ్డల నాణ్యతను బట్టి మదర్ డెయిరీ అవుట్‌లెట్లలో కేజీకి రూ.40, రూ.47, 49లకు విక్రయించారు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ (నాఫెడ్) నిర్వహిస్తున్న ఐదు అవుట్‌లెట్‌లు, మొబైల్ వ్యాన్‌లలో రూ.40కి కేజీ చొప్పున అమ్మింది. ఆజాద్‌పూర్ మార్కెట్‌లో గురువారం ఉల్లిగడ్డ ధరలు పెరిగాయి. శుక్రవారం కూడా మరో రెండు రూపాయలు పెంచనున్నామని మదర్ డెయిరీ బిజినెస్ హెడ్ (హార్టికల్చర్) ప్రదీప్త కుమార్ సాహూ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిగడ్డల లోడ్‌లు గత రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. సరఫరా సగానికి సగం పడిపోవడంతో అజాద్‌పూర్ మార్కెట్‌లో ఉల్లిగడ్డ కేజీ రూ.45 నుంచి రూ.50 మధ్య పలుకుతోందని ఆనియన్ మర్చంట్ ట్రేడర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు సురేంద్ర బుధిరాజ్ తెలిపారు.
సాధారణంగా 12,000 క్వింటాళ్లు మార్కెట్‌కు రావాల్సి ఉండగా 7,000 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని ఆయన చెప్పారు. అయితే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా లాసల్‌గావ్ మార్కెట్‌లో ఉల్లిగడ్డ కేజీ రూ.43కి లభిస్తోందని జాతీయ తోటల పరిశోధన అభివృద్ధి సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుండగా ఉల్లిగడ్డ ధరలను తగ్గుముఖం పట్టించేందుకు పాకిస్థాన్, ఇరాన్, చైనా, ఈజిప్టు దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు బుధవారం గ్లోబల్ టెండర్‌ను నాఫెడ్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఉల్లిగడ్డ సరఫరా పెంచి, పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు త్వరితగతిన సర్కార్ చర్యలు తీసువాలని నాఫెడ్ కోరింది.
అయితే రోజురోజుకు పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలను నియంత్రించేందుకు షీలా సర్కార్ చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. మూడు రోజుల క్రితం కిలో ఉల్లిని రూ.35లకే వచ్చేలా చేస్తానని ఆమె ఇచ్చిన హామీలు అమలులో మాత్రం కానరావడం లేదు. నగరవాసుల కోసం సర్కారు తెరిచిన వివిధ కేంద్రాల్లో కూడా ఉల్లిగడ్డ ధర కేజీ రూ.45 వరకు పలుకుతోంది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిల్వదారులపై కొరడా ఝళిపిస్తే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని ప్రతిపక్షాలు అంటున్నాయి.
Advertisement
Advertisement