‘ఘాటు’తగ్గడం కష్టమే!
Published Fri, Sep 20 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
న్యూఢిల్లీ: ఆకాశంలో విహరిస్తున్న ఉల్లిధరలు కొన్ని రోజుల్లో తగ్గిపోతాయనే ఆశలేమీ పెట్టుకోవద్దని ఢిల్లీ వ్యాపారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ఉత్పత్తి భారీగా తగ్గినందున, రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. అయితే మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉల్లిధరల పరిస్థితి షీలా దీక్షిత్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఢిల్లీవ్యాప్తంగా మంగళవారం వీటి కిలో ధరలు రూ. 80కి పెరిగాయి. వచ్చే నెల ధరలు కొంతమేర తగ్గవచ్చని అధికారులు చెబుతున్నా, వ్యాపారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.
నిజానికి ఉల్లి టోకు ధరల్లో పెద్దగా మార్పులు లేకున్నా, చిల్లర ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. త్వరలో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి కాబట్టి ధరలు తప్పకుండా పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ‘మా గతానుభవాలను బట్టి చూస్తే అక్టోబర్‌లో అన్ని కూరగాయల ధరలూ పెరుగుతాయి. నవంబర్ వరకు కొంత తగ్గుదల ఉండవచ్చు. ఫిబ్రవరి దాకా అలాగే ఉంటాయి. ఇప్పుడైతే అన్ని రకాల కూరగాయల కిలో ధరలు రూ.40కి పైనే ఉన్నాయి’ అని పత్పర్‌గంజ్ వ్యాపారి సంజయ్ అన్నారు.
రాజధానిలో ఈ నెల ప్రారంభం నుంచి కిలో ఉల్లి ధర దాదాపు రూ.20 దాకా పెరిగింది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉల్లి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. వర్షాలు తగ్గితే ధరలూ తగ్గే అవకాశం ఉందని ఢిల్లీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంఘం చైర్మన్ రాజేంద్ర శర్మ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోవడంతో గత నెల మాత్రం ఉల్లిధరలు కొంచెం తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉల్లి నిల్వ చేసిన గోదాముల్లో అధికారులు దాడులు జరపడంతో పరిస్థితిలో కొంచెం మార్పు కనిపించింది. అయితే ఇప్పుడున్న నిల్వలు మరికొన్ని రోజులకే సరిపోతాయి కాబట్టి మళ్లీ అదే పరిస్థితి ఏర్పడుతుందనే వాదనలు ఉన్నాయి.
ఉల్లితోపాటు దాదాపు అన్ని కూరగాయల ధరలు భారీగానే పెరిగాయి. ‘రెండుమూడు రోజులకోసారి కూరగాయల కోసం దాదాపు రూ.600 దాకా ఖర్చు చేయడం సర్వసాధారణంగా మారింది. అతి తక్కువ ధరకు దొరికే ఆలుగడ్డలు కూడా కిలోకు రూ.20 పలుకుతున్నాయి. ప్రజలు నిరసన తెలిపితే తప్ప ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు’ అని ముఖర్జీనగర్ వాసి ప్రభావర్మ అన్నారు. ఇదిలా ఉంటే ఆజాద్‌పూర్ మార్కెట్‌లో గురువారం ఉల్లి కిలో టోకుధర రూ.60 పలికింది. అయితే సరఫరాలు కాస్త పెరిగి 9,500 క్వింటాళ్లకు చేరుకున్నా.. ఇవి సరిపోవని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు.
కిలో రూ.60 చొప్పున విక్రయిస్తోన్న ప్రభుత్వం
ప్రభుత్వం కిలో రూ.60 చొప్పున ఉల్లిని అమ్మడం ప్రారంభించింది. వీటి ధరలు మరోమారు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగానే మొబైల్‌వ్యాన్ల ద్వారా తక్కువ ధరకు ఉల్లిని విక్రయించడం ఆరంభించింది. 150 మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల మంత్రి హరూన్ యూసుఫ్, అభివృద్ధిశాఖ మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్ చెప్పారు. ఉల్లి విక్రయించే సంచార వాహనం రోజుకు ఐదు ప్రాంతాల్లో తిరుగుతుంది. ప్రస్తుతం నగరానికి ఉల్లి సరఫరా తక్కువగా ఉన్నప్పటికీ వారంలోపే పరిస్థితి మెరుగవుతుందని, ధరలు కూడా అదుపులోకి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి పట్టుబడిన వ్యాపారులపై కఠిన చర్య తీసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నగరంలో ఉల్లి ధర కిలో రూ.70-80 మధ్య ఉంది.
Advertisement