అవసరమైతే స్టాళ్లు తెరుస్తాం
Published Tue, Aug 6 2013 10:44 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఘాటెక్కిన ఉల్లి ధరలను కట్టడి చేసేందుకు షీలా సర్కార్ చర్యలు ప్రారంభించింది. రాజధానిలో పెరుగుతున్న ఉల్లి ధరలను ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని అభివృద్ధి శాఖ మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్ చెప్పారు. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ప్రజలకు చౌకగా ఉల్లిపాయలను అందించడం కోసం గతంలో మాదిరిగా ఈఏడాది కూడా ప్రభుత్వం స్టాళ్లు తెరుస్తుందని చెప్పారు. నల్లబజారు మార్కెట్‌తో పాటు అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెల మొదటి ఆరు రోజులలో రాజధానికి ఉల్లి దిగుమతి తగ్గిందని చౌహాన్ చెప్పారు.
2012లో 4,513.5 టన్నుల ఉల్లి రాజధానికి రాగా, ఈసారి 3,884.5 టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. ఇది గత సంవత్సరం కన్నా అరవై టన్నులు అంటే 14 శాతం తక్కువన్నారు. గతేడాది ఆగస్టు ఒకటిన ఉల్లి హోల్‌సేల్ రేటు ధర కిలోకు రూ.4.50 నుంచి రూ.8.75 మధ్య ఉంటే, ఈసారి అది రూ.13.75 నుంచి రూ.27 మధ్య ఉందని చౌహాన్ తెలిపారు. రానున్న రోజులలో ఉల్లి ధర తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీఎంసీ పరిస్థితిని సమీక్షిస్తోందని చౌహాన్ తెలిపారు. ఉల్లి ధరలు ఢిల్లీలోనేకాక ఇతర రాష్ట్రాలలో కూడా ఎక్కువగా ఉన్నాయని వివరించే ప్రయత్నం చేశారు.
దిగిరాని ఉల్లిధరలు
ఇదిలావుండగా పెరిగిన ఉల్లి ధరలు మంగళవారం కూడా దిగిరాలేదు. ఇంకా రాజధాని వాసులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు అమాంతంగా కేజీకి రూ.50కి పెరగడంతో నగరవాసులు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల మహారాష్ట్రలోని నాసిక్, రాజస్థాన్ నుంచి వచ్చే ఉల్లిగడ్డల సరఫరా తగ్గిపోయిందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. కొత్త పంట మార్కెట్‌లోకి వస్తే ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పడతాయన్నారు. అయితే అక్టోబర్‌లో కర్ణాటక నుంచి పంట మార్కెట్‌కు వస్తే ధరలు తగ్గుతాయని వివరించారు. జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ గణాంకాల ప్రకారం...ఢిల్లీ, లాసల్‌గావ్‌లో గత నెల నుంచి ఉల్లి హోల్‌సేల్ ధరలు రూ.50 శాతం మేర పెరిగాయి. లాసల్‌గావ్ మండిలో జూలై తొలి వారంలో ఉల్లి రూ.16 నుంచి 17కి పెరిగింది. ప్రస్తుతం కేజీ రూ.30కి చేరుకుంది.
Advertisement
Advertisement