![ఏ వ్యాపారవేత్తనూ ప్రేమించలేదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61435256044_625x300_0.jpg.webp?itok=BOh59fLn)
ఏ వ్యాపారవేత్తనూ ప్రేమించలేదు
చెన్నై : ఏ వ్యాపారవేత్తనూ ప్రేమించలేదు. నాకసలు ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు అని అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఇది మొదటి నుంచి ఆమె తీస్తున్న ఆరున్నర రాగమేగా ఇందులో కొత్తేముందీ అంటారా? కాజల్ గురించి కొత్త విషయాలు సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రచారం కావడమే ఇందుకు కారణం. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బహుభాషానటిగా వెలుగొందుతున్న ఈ భామ ముంబాయి నివాసి అన్న విషయం తెలిసిందే. అయితే సక్సెస్ రేట్ తగ్గినా ప్రస్తుతం అమ్మడికి అవకాశాల జోరు తగ్గలేదన్నది వాస్తవం.
తమిళంలో ఆ మధ్య ధనుష్ సరసన నటించిన మారి కమర్శియల్‌గా ఓకే అనిపించుకున్నా ఇటీవల విశాల్‌తో రొమాన్స్ చేసిన పాయుంపులి అంతగా పంజా విప్పలేదు. అయినా కాజల్‌కు కోలీవుడ్‌లో విక్రమ్‌తో మర్మమనిధన్, జీవాతో కవలైవేండామ్, లారెన్స్‌కు జంటగా మొట్ట శివ కెట్ట శివ అంటూ ముడు చిత్రాలు. తెలుగులో మహేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం, పవన్‌కల్యాణ్ జంటగా సర్ధార్ గబ్బర్‌సింగ్‌తో పాటు ఒక హిందీ చిత్రం కూడా చేతిలో ఉన్నాయి. అయితే ఇంత బిజీగా ఉన్నా కాజల్ ముంబయికి చెందిన వ్యాపార వేత్తతో ప్రేమలో పడినట్లు, వారి ఇద్దరి చెట్టాపట్టాల్ షికార్ల తిరిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
మరో విషయం ఏమిటంటే కాజల్ అగర్వాల్ చెల్లెలి పెళ్లి ఇప్పటికే జరిగిపోవడంతో ఇంట్లో వాళ్లు కాజల్‌కు పెళ్లికొడుకు కోసం వేటని వేగవంతం చేశారని సమాచారం. అదేవిధంగా ఇంతకు ముందు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు ఈ ముంబయి బ్యూటీ మంచి వ్యాపారవేత్త అయి ఉండాలి, చక్కని హాస్య ప్రియుడై ఉండాలి అని తన మనసులోని కోరికను కాజల్ బయట పెట్టారు.
ఇవన్నీ కలిపి కూడితే కాజల్ పెళ్లి బాజాలకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం అవుతోంది. అయితే కాజల్ మాత్రం అవన్నీ వదంతులేనని ఒక్క మాటలో కొట్టిపారేస్తున్నారు. నేనే వ్యాపార వేత్తను ప్రేమించలేదని, నాకసలు ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదని అంటున్నారు. నేనిప్పటికీ ఒంటరినేనని, నాదృష్టి అంతా నటనపైనేనని అంటున్నారు.