వాగ్యుద్ధం | Jayalalithaa, MK Stalin Engage in Verbal War, Chaos Ensues in TN Assembly | Sakshi
Sakshi News home page

వాగ్యుద్ధం

Published Sat, Sep 3 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

వాగ్యుద్ధం

వాగ్యుద్ధం

రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ల మధ్య అసెంబ్లీ వేదికగా అరగంట పాటు వాగ్యుద్ధం సాగింది. ఎవరి అర్హతలు ఎంత..? అన్నట్టుగా సాగిన ఈ చర్చలో డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు పరస్పరం నినాదాల్ని హోరెత్తించడంతో సభలో  గందరగోళం చోటు చేసుకుంది.
 
 సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రజా పనుల శాఖకు కేటాయింపుల గురించి చర్చ జరిగింది. ముందుగా డీఎంకే సభ్యులు సభలో నగరంలో ట్రాఫిక్ రద్దీని పరిగణనలోకి తీసుకుని విమానాశ్రయం వరకు చేపట్టిన మెట్రో రైలుసేవల్ని, తాంబరం వరకు పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పట్టుబట్టారు. తదుపరి ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రసంగిస్తూ బడ్జెట్ దాఖలు మొదలు సభలో సాగిన వ్యవహారాలను ఎత్తిచూపుతూ, ప్రతిపక్షాలకు కొంత మేరకే మాట్లాడేందుకు సమయం కేటాయించారని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇక్కడ వ్యక్తిగత కక్షలు ఎవరికీ లేదని, అందరం ప్రజల కోసం శ్రమిస్తున్నామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు.
 
 ప్రభుత్వంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు భాగమేనని, ప్రజా హితాన్ని కాంక్షించే విధంగా ఇక్కడ చర్చించుకుందామన్నారు. రాష్ట్ర గవర్నర్ నియామకంలో కేంద్రం ఇక, రాష్ర్ట ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా స్వీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, తిరువణ్ణామలైలో మున్సిపాలిటీ భవన నిర్మాణం గతంలోనే చేపట్టినా, ప్రస్తుతం మళ్లీ నిర్మాణానికి నిధులు అంటూ కేటాయింపుల్లో సూచించి ఉండడంపై స్టాలిన్ విరుచుకు పడ్డారు. అదనపు నిధులు అని పేర్కొనకుండా, మళ్లీ కొత్త భవనానికి నిధులు అని పేర్కొని ఉండడం ఏమిటో అంటూ ప్రశ్నించారు.
 
  తదుపరి పోలీసు శాఖకు క్వార్టర్స్‌ల నియామకం అంశాన్ని స్టాలిన్ అందుకోవడం వివాదానికి దారి తీసింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు  క్వార్టర్స్‌లను నియమించి ఇస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారని, అయితే కేవలం కాంచీపురం వరకు మాత్రమే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. దీంతో సీఎం జయలలిత జోక్యం చేసుకుని పోలీసులకు గృహాల నిర్మాణం, క్వార్టర్స్‌ల గురించి ప్రస్తావించే, ప్రశ్నించే హక్కు, అర్హత డీఎంకేకు లేదని విరుచుకుపడ్డారు. దీంతో సీఎం జయలలిత, ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్‌ల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. పోలీసు గృహ నిర్మాణ బోర్డును ఎంజీయార్ ఏర్పాటు చేస్తే, రద్దు చేసింది కరుణానిధి కాదా..? అని ప్రశ్నల్ని సంధించారు.
 
  మళ్లీ తాను అధికారంలోకి రావడంతో పోలీసులకు భరోసాగా, అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. మాటల తూటాలు పేలడంతో ఎవరి అర్హతలు ఏమిటో అన్నట్టుగా వాగ్వివాదం సాగింది. చివరకు స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను సభా పద్దుల నుంచి తొలగించారు. ఇది డీఎంకే సభ్యుల్లో ఆగ్రహాన్ని రేపాయి. సీఎం జయలలిత చేసిన వ్యాఖ్యలను కూడా తొలగించాలని పట్టుబట్టారు.
 
 ఇందుకు స్పీకర్ ధనపాల్ నిరాకరించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ సభను ప్రశాంతంగా ముగిద్దామనుకుంటే, వినేట్టు లేరే..? అని డీఎంకే సభ్యులపై విరుచుకు పడ్డారు. స్పీకర్ పదే పదే వారిస్తున్నా డీఎంకే సభ్యులు ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం జోక్యం చేసుకుని స్పీకర్‌ను ధిక్కరించే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇలా అరగంట పాటుగా ఈ వివాదం సాగినా, చివరకు సద్దుమనిగింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement