జనంలోకి వస్తారనుకున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి మళ్లీ అనారోగ్యం బారిన పడ్డట్టున్నారు. గురువారం ఉదయం ఆయన్ను ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి తరలించిన సమాచారంతో డీఎంకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. దీనికి తోడు ఆ పార్టీ ముఖ్య నేతలు ఆసుపత్రికి పరుగులు తీయడంతో ఉత్కంఠ తప్పలేదు. చివరకు ఆసుపత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేయడం, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటనతో డీఎంకే వర్గాలకు ఊరట నిచ్చినట్టు అరుుంది. సాక్షి, చెన్నై
రాజకీయ మేధావి ఎం.కరుణానిధి తొమ్మిది పదుల వయస్సులోనూ డీఎంకే అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాల్లో తలమునకలై ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా ప్రచారానికి సైతం వెళ్లినా, అధికారం మాత్రం చేతికి చిక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ, నిత్యం కేడర్‌కు అందుబాటులో ఉంటూ వచ్చిన కరుణానిధి నెలన్నర రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. ప్రతిరోజూ వాడే మందుల్లో ఒకటి వికటించడంతో ఏర్పడ్డ అలర్జీ కారణంగా ఆయన శరీరంపై దద్దుర్లు ఏర్పడ్డట్టు సంకేతాలు వెలువడ్డారుు. అప్పటి నుంచి గోపాలపురం ఇంటికే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది.
నెల రోజులుగా అపారుుంట్‌మెంట్‌లు అన్నీ రద్దు అయ్యారుు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ఇతర కుటుంబీకుల్ని మాత్రమే గోపాలపురానికి అనుమతించారు. గత నెల 24వ తేదీన కరుణానిధి ఆరోగ్యం మెరుగు పడ్డట్టు డీఎంకే వర్గాలు ప్రకటించడమే కాకుండా, ఆయన్ను పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ పరామర్శిస్తున్నట్టుగా ఓ ఫొటోను విడుదల చేశారు. దీంతో డీఎంకే వర్గాల్లో ఆనందం నెలకొంది. మరో వారం పది రోజుల్లో తమ ముందుకు వస్తారని ఎదురు చూసే పనిలో పడ్డారు. ఈ సమయంలో గురువారం ఉదయాన్నే కరుణానిధి ఆసుపత్రిలో చేరిన సమాచారం డీఎంకే శ్రేణుల్లో ఆందోళన రేకెత్తించింది. కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే విధంగా మరికొద్ది రోజుల్లో ప్రజల ముందుకు వస్తారనుకున్న కరుణానిధి ఆసుపత్రిలో చేరడం ఉత్కంఠ రేపింది. కరుణానిధి కుటుంబీకులు, స్టాలిన్, కనిమొళి , అళగిరి, దయానిధిమారన్, సినీ నటుడు నెపోలియన్, ఎమ్మెల్యేలు దురైరుగన్ , ఎం.బ్రమణియన్, వాగై చంద్రశేఖర్, పొన్ముడి, శేఖర్‌బాబు, అన్భళగన్, ముఖ్య నాయకులు నగరంలోని పార్టీ కేడర్ ఆళ్వార్ పేటలోని కావేరి ఆసుపత్రి వద్దకు పరుగులు తీశారు.
కాసేపు ఉత్కంఠ నెలకొన్నా, తదుపరి ఆసుపత్రి వర్గాలు, భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు. గోపాలపురం ఇంటిలో అస్వస్థతకు గురైన కరుణానిధిని స్టాలిన్, దయానిధి మారన్ ఆసుపత్రికి తరలించారు. యథా ప్రకారం కరుణానిధి ఉపయోగించే కారులోనే ఆసుపత్రికి వెళ్లిన సమాచారంతో ఆరోగ్య సమస్య జఠిలంగా ఉండదని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆసుపత్రి డెరైక్టర్ అరవిందన్ సెల్వరాజన్ బులిటెన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, అరుుతే, న్యూట్రీషన్, హైడ్రేషన్ సమస్యతో బాధ పడుతున్నారని, అందుకు తగ్గ చికిత్సలు అందిస్తున్నట్టు వివరించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరి కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందితే చాలు అని ప్రకటించడంతో డీఎంకే వర్గాల్లో నెలకొన్న ఆందోళనకు తెర పడింది.
అదే సమయంలో ఆసుపత్రి వెలుపల స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వద్దు అని భరోసా ఇవ్వడం, యథా ప్రకారంగా నిర్వహించే వైద్య పరీక్షల్లో భాగంగానే తాజా చికిత్స అని ప్రకటించడంతో ఊరట కల్గినట్టు అరుుంది. ఎవ్వరూ ఆసుపత్రి వద్దకు రావద్దంటూ కేడర్‌కు స్టాలిన్ సూచించారు. ఇక, ఆళ్వార్‌పేటలోని ఆసుపత్రి పరిసరాల్లో నగర పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.