సాక్షి, ముంబై: ‘రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నలను ప్రకృతి విపత్తు ఆగమాగం చేసింది. ఇలాంటి వీరికి మేమున్నామనే భరోసాను కలిగించే నాయకుడే కరువయ్యారు. బ్యాంక్ రుణాలు కూడా అన్నదాతలకు సకాలంలో అందడం లేదు. వీరు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి చేజారిపోతోంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రానికి చెందిన శరద్ పవార్ సమాధానం చెప్పాల’ని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిని గద్దె దింపాలని వార్ధాలో గురువారం జరిగిన బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు.
తొలుత మరాఠీలో తన ప్రసంగాన్ని ప్రారంభించి స్థానికులను ఆకట్టుకున్న మోడీ, వడగళ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చారు. ‘లాల్ బహదూర్ శాస్త్రి’ జై జవాన్, జై కిసాన్ అనే నినాదాన్ని అందించారు. కానీ ప్రస్తుతం మనదేశంలో జవాన్లు (సైనికులు), రైతులు సురక్షితంగా లేరన్నారు. రైతులను గిట్టుబాటు ధరలు లభించడం లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ‘రైతులకు బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం ఐదు శాతం రుణాలే రైతులకు అందుతున్నాయి. మిగతా 95 శాతం రుణాలను పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు ఇస్తోంది.
ఇలా వ్యవహరిస్తే రైతులు ఆత్మహత్యలు ఎలా తగ్గుతాయ’ని మోడీ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో వచ్చిన అనంతరం రైతులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని, సాగుతాగు నీటిపై ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులు రూపొందిస్తామని చెప్పారు. పత్తి రైతుల కోసం ‘ఫైవ్ ఎఫ్ ఫార్ములా’ రూపొందిస్తామన్నారు. ఈ సభలో బీజేపీ ప్రముఖ నాయకులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఏదీ నీ ‘పవార్’!
Published Thu, Mar 20 2014 10:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement