రాజకీయాల్లోకి వచ్చేశా..! అంటూ గత ఏడాది చివరి రోజునదక్షిణభారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ తనఅభిమానులకు సంకేతాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. సొంత పార్టీతో ప్రజల్లోకి వెళ్దామని ఆయన ప్రకటించి నాలుగు నెలలుకావస్తోంది. ఈ కాలంలో అభిమాన సంఘాల్ని ఏకంచేసే పనిలో రజనీ నిమగ్నం అయ్యారు. రజనీ మక్కల్ మండ్రంను ప్రకటించి, కార్యవర్గాల ఎంపిక మీద దృష్టి పెట్టారు. జిల్లాల వారీగాకార్యవర్గాల ఎంపిక ముగింపు దశకు చేరింది. మక్కల్ మండ్రం శాఖలను రాష్ట్రంలో 65 వేలుగా ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు కోటి లక్ష్యంగా రజనీకాంత్ నిర్ణయించారు. మక్కల్ మండ్రం మీదే పూర్తిస్థాయిలో దృష్టి సాగుతున్నా, పార్టీ ఎప్పుడెప్పుడెప్పుడా అన్నది మాత్రం దాటవేత ధోరణితో ముందుకుసాగుతోంది.
తమిళ కొత్త సంవత్సరాది వేళ పార్టీ ప్రకటన చేయవచ్చన్న ప్రచారం తొలుత సాగింది. అయితే, ఆ రోజున రజనీ ఎలాంటి ప్రకటన చేయకపోగా, అసలు స్పందించనే లేదు. రాజకీయ పార్టీ కసరత్తులుసాగుతూనే ఉన్నాయని పదే పదేచెప్పుకుంటున్నా, ప్రకటన కోసం వేచి చూడాల్సిందేనని నాన్చుడు ధోరణిలో పడ్డారు. అదే సమయంలో ప్రజలసమస్యలపై స్పందిస్తూ, కావేరివ్యవహారంపై ప్రకటనలే కాదు, స్వయంగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చుతూ వచ్చిన రజనీ కాంత్ మరి కొద్దిరోజుల్లో అమెరికా పయనానికి సిద్ధం అవుతుండడం గమనార్హం.
సాక్షి, చెన్నై : త్వరలో తలైవా రజనీకాంత్ అమెరికా పయనం కానున్నారు. వారం రోజులకుపైగా అక్కడే ఆయన ఉంటారు. ఈ పర్యటన ఏర్పాట్ల సమాచారంతో ఇప్పట్లో రజనీ పార్టీ ప్రకటన అనుమానంగా మారింది.గత నెల రజనీ కాంత్ ఆధ్యాత్మిక పయనాన్ని సాగించారు. రిషికేష్, ఉత్తరాఖండ్, బాబా ఆశ్రమాల సందర్శనకు ఆయన వెళ్లడం, అక్కడి నుంచి రాగానే రాజకీయ ప్రకటన తథ్యమని ప్రచారం సాగింది. అయితే, తలైవా పార్టీ విషయంగా నోరు మెదపలేదు. ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో రజనీ అమెరికా పయనం కాబోతున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లలో సన్నిహితులు ఉన్నారు. వారం రోజులకు పైగా ఆయన అక్కడే ఉంటారని సమాచారం.
రజనీ అమెరికా పర్యటనతో ఇప్పట్లో పార్టీ ప్రకటన అనేది అనుమానమే అని తెలుస్తోంది. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం ఈ పర్యటన ముందుగా నిర్ణయించినదేనని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు రజనీ వెళ్తున్నట్టు, ఆయన పర్యటనకు వెళ్లినా, పార్టీ ఏర్పాటు కసరత్తులు, ఇతర వ్యవహారాల మీద దృష్టి పెట్టేందుకు తగ్గ ఏర్పాట్లు చేసే వెళ్తారని స్పందిస్తున్నారు. తలైవా అమెరికా పర్యటన ఎప్పుడు అన్నది అధికారికంగా ప్రకటన వెలువడుతుందని పేర్కొంటున్నారు. కాగా, సినిమా వివాద సమస్య సమసిపోవడంతో మరో నెల రోజుల్లో ‘కాల’ విడుదల, ఆ తదుపరి రోబో విడుదల మీద రజనీ దృష్టి పెట్టబోతున్నారు. ఆ తదుపరి మరో కొత్త సినిమా మీద పూర్తిగా లీనం కానున్న నేపథ్యంలో, ఇక రాజకీయ పార్టీ అన్నది ఈ ఏడాది కూడా లేన్నట్టే అన్న చర్చ ఊపందుకుంది.
రజనీతో ఆనంద రాజ్ భేటీ
అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన అనంతరం సినీ నటుడు ఆనంద రాజ్ పార్టీలకు దూరంగా ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వైపు ఆయన చూపు మరళినా, చివరకు వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన పోయెస్ గార్డెన్‌లోని రజనీ కాంత్ ఇంటి మెట్లెక్కడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రజనీని పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం. తమిళ ప్రజల మీద రజనీకి చిత్తశుద్ధి ఉందని, వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన అడుగులు సాగుతున్నాయని కితాబు ఇచ్చారు. ప్రజా జీవితంలోకి పూర్తిస్థాయిలో తనను ఆయన త్వరగా అంకితం చేసుకుంటారన్నారు. అయితే, రజనీకి వ్యతిరేకంగా భారతీరాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆనంద రాజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment