‘కాల్పుల’ కల్లోలం!
సాక్షి, చెన్నై:తమిళ జాలర్లపై కడలిలో శ్రీలంక సేనలు తూటాలను ఎక్కుబెట్టడం కలకలం రేపింది. తూటాల దెబ్బకు ఓ పడవ మునిగింది. అందులోని ఆరుగురిని కొందరు జాలర్లు అతి కష్టం మీద రక్షించారు. రామేశ్వరానికి చెందిన 22 మంది, పుదుకోట్టైకు చెందిన 24 మందిని శ్రీలంక సేనలు పట్టుకెళ్లాయి. సముద్రంలో రాష్ట్ర జాలర్లకు భద్రత కరువైంది. పాలకులు మారినా, తమబతుకులు ఇంతే అన్న ఆవేదనలో జాలర్లు ఉన్నారు. వరుస దాడులతో శ్రీలంక సేనలు తమ వీరంగాన్ని ప్రదర్శిస్తూ రావడం జాలర్లను తీవ్ర ఆందోళనలో పడేస్తున్నాయి. సమ్మె బాట పట్టినా, నిరసనలు తెలియజేసినా, పాలకుల హామీలు బుట్ట దాఖలవుతున్నాయి. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ భరోసాతో,
కడలిలోకి వెళ్లిన రామేశ్వరం, రామనాథపురం, పాంబన్ జాలర్లకు చివరకు మిగిలింది కన్నీళ్లే. ఇన్నాళ్లు చితకబాది బందీలుగా పట్టుకెళ్లే శ్రీలంక సేనలు ప్రస్తుతం తూటాలను ఎక్కుబెట్టడం జాలర్ల బతుకును ప్రశ్నార్థకం చేస్తున్నది. కాల్పులతో కల్లోలం: రెండు మూడు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులతో కడలి కల్లోలంగానే ఉంది. సముద్ర కెరటాలు ఎగసి పడుతున్నాయి. అయినా, బతుకు బండి లాగడం కోసం రామేశ్వరం, రామనాథపురం, పాంబన్ జాలర్లు బుధవారం రాత్రి కడలిలోకి వెళ్లారు. కచ్చదీవుల సమీపంలో అర్ధరాత్రి వలలను విసిరి వేటలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో అటు వైపుగా వచ్చిన లంక సేనలు వీరంగం సృష్టించాయి. వారు వచ్చీ రాగానే ఓ పడవను టార్గెట్ చేసి తూటాలను ఎక్కుబెట్టారు. భయాందోళన చెందిన జాలర్లు తమ పడవలతో ఒడ్డుకు తిరుగు ముఖం పట్టారు.
జాలర్ల వలల్ని తెంచి పడేస్తూ, కాల్పులతో లంక సేనలు పైశాచికంగా వ్యవహరించాయి. తూటాల దెబ్బకు ఆ పడవ నీట మునిగింది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు అందులోని ఆరుగురు జాలర్లు సముద్రంలోకి దూకేశారు. ఈదుకుంటూ వస్తున్న వారిని మరో పడవలో ఉన్న జాలర్లు అతి కష్టం మీద రక్షించారు. అప్పటికే శ్రీలంక సేనలు ఐదు పడవల్ని చుట్టేశారుు. అందులో ఉన్న 22 మందిని తమ బందీలుగా పట్టుకెళ్లారు. వీరిని మన్నార్ వలిగూడాలో ఉంచారు. శ్రీలంక నావికాదళానికి చెందిన మరో బృందం పుదుకోట్టై జాలర్ల మీద తమ ప్రతాపం చూపించింది. వలల్ని తెంచి పడేసి, ఓ పడవను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆరు పడవలతో పాటుగా 24 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. వీరిని నెడుం దీవుల్లో ఉంచింది.
ఆందోళన : తమ వాళ్ల మీద దాడితో జాలర్ల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రామేశ్వరం జాలర్లపై తూటాలను ఎక్కుబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. గతం పునరావృతం అవుతున్నట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తూటాలను ఎక్కుబెట్టి హెచ్చరికలు చేశారని, పడవలను సముద్రంలో మునిగేలా చేశారని పేర్కొంటున్నారు. ఆ తర్వాత జాలర్లకు తూటాలు గురి పెట్టారని గుర్తు చేస్తూ, గతం పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తృటిలో తూటాల భారీ నుంచి తప్పించుకున్న ఆరుగురు జాలర్లు మీడియాతో మాట్లాడుతూ, చిమ్మ చీకట్లో సినీ తరహాలో తమ మీద కాల్పులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత తమ బోట్లకు గురి పెట్టారని, తమ మీద గురి పెట్టే సమయంలో సముద్రంలోకి దూకేశామని, లేకుంటే తమ ప్రాణాలు గాల్లో కలసి ఉండేవని విలపించారు. సముద్రంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈదుకుంటూ వస్తున్న తమను కొంత దూరం లంక సేనలు వెంబడించాయని, తాము కాసేపు నీళ్లలోకి వెళ్లడంతో తప్పించుకోగలిగామని చెప్పారు.
సీఎం సీరియస్: కడలిలో జాలర్లపై శ్రీలంక తూటాలు ఎక్కుబెట్టడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా పరిగణించారు. గతంలో సాగిన కాల్పులు, అనంతరం పట్టుకెళ్లిన సంఘటనలు వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. శ్రీలంక దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, ఆ దేశాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, రాజ్యంగ పరమైన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక సేనలు పట్టుకెళ్లిన 46 మంది జాలర్లను విడిపించాలని డిమాండ్ చేశారు. ఇది వరకే ఆ దేశ ఆధీనంలో ఉన్న 23 పడవలతో పాటుగా, తాజాగా పట్టుకెళ్లిన 11 పడవలను విడుదల చేయించాలని కోరారు. శ్రీలంక సేనలు తూటా ఎక్కుబెట్టడాన్ని డీఎంకే అధినేత కరుణానిధి, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు తీవ్రంగా ఖండించారు. శ్రీలంక పైశా