వెంకయ్యా.. ఇదేందయ్యా?
♦ సచివాలయంలో సమీక్షపై విమర్శలు
♦తప్పేమిటన్న తంబిదురై
రాష్ట్ర పరిపాలనకు ప్రధాన స్థానమైన సచివాలయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలకు ఇది నాందివాచకమని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెట్రో సొరంగ మార్గ రైలు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రెండురోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం మెట్రోరైలు ప్రారంభం పూర్తి చేసుకుని అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపుగా అన్నిచోట్లా బీజేపీ పతాకాలు రెపరెపలాడాయి. ప్రధాని నరేంద్రమోదీ, వెంకయ్య ఫొటోలు ప్రముఖంగా వెలసాయి. అన్నానగర్‌లో అన్నాడీఎంకే పతాకాలకు పోటీగా బీజేపీ జెండాలను ఎగురవేసి రెండు పార్టీలు మిత్రపక్షం అనే ధోరణిని ప్రదర్శించాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఆదివారం సాయంత్రం చెన్నై సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం ప్రముఖంగా చర్చనీయాంశమైంది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహవసతి, దారిద్య్ర నిర్మూలన, సమాచార, ప్రసార శాఖలు రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరుపై అధికారులతో సమావేశం అయ్యారు. ఒక కేంద్ర మంత్రి సచివాలయంలో సమావేశమైన ఘటన రాష్ట్ర చరిత్రలో లేదని వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని వెంకయ్యనాయుడు సంకేతాలు ఇచ్చారని కొందరు చెవులు కొరుక్కున్నారు.
జయలలిత జీవించి ఉన్నంత వరకు బీజేపీ ప్రభుత్వం ఇటువంటి సాహసానికి ఒడిగట్టలేదు. 50 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల బలంతో అన్నాడీఎంకే కేంద్రంలో మూడో అతిపెద్ద పార్టీగా విరాజిల్లడం వల్ల జయలలితను చూసి కేంద్రమే భయపడేది. జయ హయాంలో కేంద్రమంత్రులు చెన్నైకి వచ్చేదీ పోయేదీ కూడా తెలియరాదు అన్నట్లుగా వ్యవహరించేవారు. జయ మరణంతో గతంలోని పరిస్థితి తలకిందులుగా మారింది. అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అన్నాడీఎంకే బలహీనంగా మారిపోవడంతో ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో సైతం కేంద్రం జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం సచివాలయంలో వెంకయ్య నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. సమీక్షా సమావేశాన్ని నిర్వహించి సీఎం ఎడపాడితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించడాన్ని ఆక్షేపిస్తున్నారు. సీఎంగా జయలలిత ఉంటే ఇలా జరిగేదా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో మెట్రోరైలు తొలిదశ ప్రారంభంలో జయ ఒకచోట వెంకయ్యనాయుడు మరోచోట ఉండడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారనేందుకు నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలపై ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సచివాలయంలో సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదు, అవసరమని భావించిన పక్షంలో మరోచోట సమావేశం కావాలని వ్యాఖ్యానించారు. తన పరిధిలోని శాఖల సమీక్షా సమావేశాన్ని సీఎం సమక్షంలో జరపడం ద్వారా ముఖ్యమంత్రి ఎడపాడిని తన కట్టడిలోకి తీసుకొచ్చినట్లుగా వెంకయ్య వ్యవహరించారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దన్న తరహాలో రాష్ట్రంపై పెత్తనానికి సమాయత్తమైందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా సచివాలయంలో కేంద్రమంత్రి వెంకయ్య సమీక్షా సమావేశం నిర్వహిస్తే తప్పేమిటని లోక్‌సభ ఉపసభాపతి తంబిదురై సమర్థించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ తాను కూడా ఇతర రాష్ట్రాల్లో సమావేశాలు జరిపానని, వెంకయ్య సమావేశాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.