
సినీ ప్రముఖులకు సర్కారు అండ!
- తెలంగాణ ప్రభుత్వం వారిని కాపాడుతోంది
- బీజేవైఎం ఆరోపణ.. ఎక్సైజ్ ఆఫీస్ ముట్టడి
హైదరాబాద్: టాలీవుడ్ సినీ పరిశ్రమ డ్రగ్స్ మాఫియాలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలపై 12మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ రాకెట్ సూత్రధారి కెల్విన్ కాల్‌లిస్ట్‌లో మరో 15మంది సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయని, కానీ ప్రభుత్వ పెద్దలతో తెరవెనుక మంతనాలు జరిపి.. వారు తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బీజేవైఎం కార్యకర్తలు శనివారం నగరంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎక్సైజ్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని వారు ఆరోపించారు. బీజేవైఎం కార్యకర్తల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది.