మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా): పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన దుబాయ్‌లో నేర చరిత్ర ఉన్నవారికి ప్రవేశం లేకుండా అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. విజిట్ వీసాపై దుబాయ్ పర్యటించాలన్నా.. లేదా దుబాయ్‌లో ఉపాధి కోసం వర్క్ వీసాను పొందాలనుకుంటే తాజాగా పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)ను కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈనెల నాలుగో తేదీ నుంచి కొత్త విధానం అమలులోకి తెచ్చింది.
ఇప్పటి వరకు కేవలం పాస్‌పోర్ట్ జారీ చేసే సమయంలో విదేశాంగ శాఖ సదరు వ్యక్తి నేర చరిత్ర.. ప్రవర్తనను స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో విచారణ చేయిస్తుంది. కొత్త విధానంలో వీసా కావాలంటే మరోసారి పీసీసీ అవసరమని దుబాయ్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీంతో దుబాయ్‌కి వెళ్లే వారు పీసీసీ కోసం పాస్‌పోస్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికే పాస్‌పోర్టు కోసం ఆధార్‌తో అనుసంధానం అయి ఉండటం.. మరోవైపు పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్ కేసుల నమోదు సమయంలో ఆధార్‌ను నమోదు చేస్తుండటంతో వారి చరిత్ర మొత్తం బయటపడుతుంది.
గతంలో ఎప్పుడో పాస్‌పోర్టు పొంది.. చాలా కాలం తర్వాత వీసా తీసుకోవడం.. ఆ మధ్యలో నేరాలు చేయడంతో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ ఉన్నవారికే దుబాయ్ వీసా జారీ కానుండటంతో క్రిమినల్ కేసుల్లో ఉన్నవారు దుబాయ్‌కి వెళ్లడానికి దాదాపు అవకాశాలు మూసుకుపోయినట్లే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీలను స్థానిక పోలీసు స్టేషన్‌ల నుంచి కాకుండా పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పొందాలనే నిబంధన ఉండటంతో ఏ స్టేషన్‌లో కేసు నమోదు అయినా అలాంటి వారికి దుబాయ్ వీసా లభించదు.
కొత్త విధానం మంచిదే
దుబాయ్ వీసాలకు పీసీసీ తప్పనిసరి చేయడం మంచిదే. నేర ప్రవృత్తి ఉన్నవారికి దుబాయ్‌లో ప్రవేశానికి అవకాశం ఉండదు. గతంలో సొంత ప్రాంతంలో నేరం చేసి దుబాయ్‌లో తలదాచుకునేవారు. ఇప్పుడు కొత్త విధానంతో అలాంటి అవకాశం ఉండదు. కొత్త విధానం ఎంతో మంచిది. – కుంట శివారెడ్డి, సప్లయింగ్ కంపెనీ యజమాని (దుబాయ్)
Comments
Please login to add a commentAdd a comment