మాట్లాడుతున్న నాగిరెడ్డి, చిత్రంలో కలెక్టర్ అమ్రపాలి, సీపీ ఇతర అధికారులు
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల పదవీ కాలం జూలై 31తో ముగుస్తుందని, అవసరమైతే మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని.. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి సూచించారు. హన్మకొండలోని అర్బన్ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరగల్ అర్బన్,రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల అధికారులతో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కొత్త గ్రామ పంచాయతీల ప్రతిపాదనలపై స్పష్టత రాకపోతే.. పాత పంచాయతీలకే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు సమయానికి జరిగినా, ముందస్తు జరిగినా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా, సిబ్బంది కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, రవాణా ఏర్పాట్లు, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం వంటి పనులు పూర్తి చేసుకోవాలన్నారు.
ఓటర్ల జాబితాలో ఉంటేనే...
గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఓటర్ల జాబితా తయారు చేయడం ఉండదని, అసెంబ్లీ ఓటర్ల జాబితానే గ్రామ పంచాయతీల వారీగా విభజించడం జరుగుతుందని నాగిరెడ్డి తెలిపారు. అసెంబ్లీ తుదిజాబితాలో పేరున్న వారు మాత్రమే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ విషయం గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోటీ ఎక్కువగా ఉంటుందని.. ద దీన్ని దృష్టిలో ఉంచుకుని జాబితాలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితా తయారీ, ఇతర ఏర్పాట్ల కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలన్నారు.
రెండు, మూడు విడతల్లో ఎన్నికలు..
జిల్లాల విభజన నేపథ్యంలో సిబ్బంది కొరత దృష్ట్యా రెండు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ బాక్స్‌లు అర్బన్ జిల్లా మినహా మిగతా జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటాయని.. ఈ మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకువచ్చేంలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
130 గ్రామ పంచాయతీలు
అర్బన్ జిల్లాలో కొత్త ప్రతిపాదిత జీపీలతో కలిపి మొత్తం 130 జీపీలు అవుతున్నాయని 1,93,066 మంది ఓటర్లు, 1234 వార్డులు ఉన్నాయని కలెక్టర్ అమ్రపాలి కాట తెలిపారు. రెండు దశల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని, 913 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం అవుతాయని తెలిపారు. జనగామ జేసీ వనజాదేవి మాట్లాడుతూ జనగామలో 298 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వీటిలో 91కొత్త జీపీలు ఉన్నాయని, 3.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 1466 బ్యాలెట్ బాక్స్‌లు కావాల్సి ఉంటుందన్నారు. జయశంకర్ జిల్లా జేసీ అమయ్‌కుమార్ మాట్లాడుతూ భూపాలపల్లిలో జాతర నేపథ్యంలో పనులు చేయలేదని.. వారం గడువిస్తే ఎన్నికల సంబంధిత పనుల్లో వేగం పెంచుతామన్నారు. మహబూబాబాద్ జేసీ దామోదర్ మాట్లాడుతూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూరల్ జేసీ హరిత మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 266 గ్రామపంచాయతీలున్నాయని.. అదనంగా 136 ప్రతిపాదించామన్నారు. అర్బన్ నుంచి సిబ్బందిని అవసరం కోసం తీసుకుంటామన్నారు. పోలీస్ కమిషనర్ సు«ధీర్‌బాబు, ఎస్పీలు భాస్కరన్, కోటిరెడ్డి, జేసీ దయానంద్, జెడ్పీ సీఈఓ విజయ్‌గోపాల్, ఆర్డీఓలు వెంకారెడ్డి, మహేందర్‌జీ, ఐదు జిల్లాల డీపీఓలు, ఆర్డీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కాగా, ఈవీఎం గోదాంలోని బ్యాలెట్ బ్యాక్స్‌లను అధికారులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment