కిరాతకుడు..
- కుటుంబ కలహాలతో కూతురిని చంపిన తండ్రి
- మృతదేహాన్ని క్వారీలో పడేసిన వైనం
- మద్యం మత్తులో ఘాతుకం
- కర్ణాటక రాష్ట్రం కల్లూరులో ఘటన
తాండూరు రూరల్: కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కుటుంబ కలహాలతో ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. మద్యం మత్తులో మృగంలా మారి చంపేసి మృతదేహాన్ని క్వారీలో పడేసి పరారయ్యాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన తాండూరు మండలం సంగెంకాలన్ సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, కర్ణాటక పోలీసుల కథనం ప్రకారం.. తాండూరు మండలం సంగెంకాలన్ గ్రామానికి చెందిన నజాబేగంను ఏడేళ్ల క్రితం ముంబైకి చెందిన శంషీర్ వివాహం చేసుకున్నాడు. సంగెంకాలన్‌లో ఉంటున్న దంపతులకు కుమారుడు సోయాబ్‌ఖాన్, కూతురు గుల్‌శరా(4) ఉన్నారు.
చిన్నారి స్థానికంగా అంగన్‌వాడీ పాఠశాలలో చదువుతోంది. కొంతకాలం పాటు పాలిషింగ్ యూనిట్లో పని చేసిన ఇటీవల పనిమానేశాడు. మద్యానికి బానిసై భార్య నజాబేగంను వేధించసాగాడు. ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం శంశీర్ కుటుంబీకులతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో మధ్యాహ్నం 3 గంటలకు కూతురు గుల్‌శరాకు బిస్కెట్లు కొనిస్తానని చెప్పి ఆమెను సంగెంకాలన్‌కు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామం వైపు వెళ్లాడు. కుటుంబీకులు, స్థానికులు అతడిని వెంబడించగా రాళ్లతో దాడి చేశాడు. కూతురును గొంతునులిమి చంపేసిన శంషీర్ మృతదేహాన్ని కల్లూరు శివారులోని ఓ నాపరాతి క్వారీలో పడేశాడు. అక్కడి నుంచి ఓ లారీలో చించోలి నుం చి చాంగ్‌లేర్ మీదుగా వెళ్తుండగా స్థాని కులు ఓ వాహనంలో వెంబడించి అతడిని పట్టుకొని కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపగా కూతురి హత్య విషయం తెలిపాడు.
క్వారీ నుంచిమృతదేహం వెలికితీత..
కర్ణాటక రాష్ట్రం కల్లూరు శివారులోని ఓ పాడుబడ్డ క్వారీలోంచి మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మిర్యాణ్ ఎస్‌ఐ హేమంత్‌కుమార్ చించోలి ఫైర్ ఆఫీసర్ శివరాజ్ కంగ్‌టీ సాయంతో వెలికితీయించారు. విగతజీవిగా పడి ఉన్న తన కూతురును చూసిన తల్లి నజాబేగం తల్లడిల్లిపోయింది. మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని ఆమె హృదయ విదాకరంగా రోదించిన తీరుకు స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని చించోలి డీఎస్పీ, సీఐలు పరిశీలించారు. అనంతరం అక్కడి చందాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటంబీకులకు అప్పగించారు. నిందితుడు శంషీర్‌ను రిమాండుకు తరలించినట్లు మిర్యాణ్ పోలీసులు తెలిపారు.