- టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక వాయిదా
- ఇన్‌చార్జీల నియామకంపైనా తేల్చని తీరు
- ఉన్నదే నలుగురు.. ఏకాభిప్రాయం కరువు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో కుదేలైన తెలుగుదేశం పార్టీ పరిస్థితి జిల్లాలోనూ దయనీయంగా ఉంది. టీడీపీకి జిల్లా అధ్యక్షుడిగా ఉండేందుకు ఎవరు ముందుకురావడం లేదు. ఒకరిద్దరు బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. కొత్తగా పార్టీలోకి మళ్లీ వచ్చిన వారు కావడంతో టీడీపీ అధిష్టానం ఈ విషయంలో ఎటూ తేల్చకపోతోంది. ఈ కారణాలతో టీడీపీకి జిల్లా అధ్యక్షుడు లేకుండా పోయింది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం సోమవారం జరిగిన జిల్లా ఎన్నికల సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. ప్రస్తుత టీడీపీ పరిస్థితిపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఒకప్పుడు తీవ్రంగా ఉండేదని.. ఇప్పుడు ఎవరు తీసుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక సోమవారం జరగాల్సి ఉంది. రాష్ట్రస్థాయిలో జిల్లా నుంచి తనకు పోటీ లేకుండా ఉండేందుకు.. మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేలా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రయత్నించారు. టీడీపీ రాష్ట్ర ఉన్నత స్థాయి కమిటీ పొలిట్‌బ్యూరోలో స్థానం దక్కించుకోవాలని ప్రకాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి అధిపత్య పోరుతో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరగలేదు. సమావేశంలో తాను జిల్లా అధ్యక్ష పదవి చేపట్టలేనని ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కూడా పని ఒత్తిడి కారణంగా తనకు బాధ్యతలు వద్దని అన్నారు.
వీరిద్దరు కాకుండా ఎవరికి ఇవ్వాలనే విషయంలో పార్టీలో పలు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది. భూపాలపల్లి టీడీపీ ఇన్‌చార్జీ గండ్ర సత్యనారాయణరావు తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీ చేసి.. మళ్లీ టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సరికాదని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. వర్ధన్నపేట నియోజకవ్గ ఇన్‌చార్జి ఈగ మల్లేశం తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎస్సీలకు రిజర్వు అయిన నియోజకవర్గానికి ఈగ మల్లేశంను ఇన్‌చార్జీగా నియమించి ఇప్పటికే పార్టీ తప్పు చేసిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇన్‌చార్జీ ఉన్న నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా దెబ్బతినేలా చేసిన నాయకుడికి ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఎలాగని అంటున్నారు. ఇలా అయోమయ పరిస్థితులతో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల 24న జరగనున్న మినీ మహానాడులోపు ఈ పదవిని భర్తీ చేయాలని ఎన్నికకు పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర నాయకులకు.. జిల్లా పార్టీ నేతలు విన్నవించుకున్నారు.మరోవైపు నియోజకవర్గ ఇన్‌చార్జీలను నియమించకపోవడంపైనా టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం చేశామని పదేపదే చెప్పుకునే టీడీపీ.. నియోజకవర్గ ఇన్‌చార్జీల నియామకం విషయంలో వ్యవహరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వర్ధన్నపేట(ఎస్సీ) నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన ఈగ మల్లేశం ఇన్‌చార్జీగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈయన కార్యక్రమాలు నిర్వహించడంలేదని.. దీంతో పార్టీ బలహీనపడుతోందని టీడీపీ కేడర్ వాపోతోంది. స్టేషన్‌ఘన్‌పూర్(ఎస్సీ)లో టీడీపీకి ఎవరు దిక్కులేని పరిస్థితి ఉంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌లో దొమ్మాటి సాంబయ్య పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జీగానే కొనసాగుతున్నారు.
పరకాల నియోజకవర్గానికి ప్రస్తుతం టీడీపీ ఇన్‌చార్జీ ఎవరు లేరు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి గెలిచిన చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 10 నెలలు ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జీగా ఎవరిని నియమించలేదు. ఎవరు దొరకకపోవడం వల్లే ఇక్కడ ఈ పరిస్థితి ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
‘దేశం’కు దిక్కెవరు!
Published Tue, May 19 2015 4:50 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement