శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల గోడు వర్ణనాతీతం. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 65గ్రామాల ప్రజలు ఇళ్లు, భూములు కోల్పోయారు. పొట్టచేతబట్టుకొని కట్టుబట్టలతో ఊళ్లు ఖాళీచేసి 30ఏళ్లు అవుతున్నా పాలకులు కరుణించడం లేదు. నేటికీ వారి బతుకుకు భరోసా
లభించడంలేదు. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప వారి జీవితాలు ఇంకా చీకటిమయంగానే ఉన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు వారికి షరా మాములుగా మారాయి.
సాక్షి, మహబూబ్‌నగర్ :శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వ ల్ల జిల్లాలో కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజ కవర్గాల పరిధిలోని 65 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 11,192 కుటుంబాలకు చెందిన 35,903 మంది నిరాశ్రయులు అయినట్లు ప్రభుత్వ గ ణాంకాలు సూచిస్తున్నాయి. వీరంతా కూడా 1981లో వారి వారి గ్రామాలను ప్రభుత్వం బలవంతంగా ఖా ళీ చేయించింది. నష్టపరిహారం కింద ఎకరాకు కేవ లం రూ.2,500, ఇంటికి రూ.5వేలు మాత్రమే అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో నిర్వాసితులు ఆందోళనలు చేపట్టడంతో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అందుకు అనుగుణంగా జీఓ 98 విడుదల చేశారు. దీని ప్రకారం ప్రతి కుటుంబం నుంచి అర్హతను బట్టి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా వారిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. చివరికి బాధితులందరూ కోర్టు తలుపు తట్టారు. రాష్ట్ర హైకోర్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ, ప్రతి కుటుంబానికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచిస్తూ 2006లో తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దరఖాస్తులను స్వీకరించింది.
దాదాపు 2వేల మంది ఉన్నారని కమిటీ గుర్తించింది. అందుకు అనుగుణంగా నీటిపారుదలశాఖతో పాటు జెన్‌కోలలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్, వాచ్‌మెన్ తదితర ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచిస్తూ గతేడాది జీఓ నెంబర్ 68 విడుదలైంది. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్‌రావు ఈ విషయమై స్వయంగా అధికారులను ఆదేశించినా ఇప్పటికీ అమలు కావడంలేదు.
కుచించుకుపోతున్న అర్హుల జాబితా
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల తలరాత మారడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 65 గ్రామాల పరిధిలో దాదాపు 1,192కుటుంబాలు నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాల్సి ఉంది. అయితే ఏళ్లు గడుస్తుండడంతో చాలా గ్రామాలకు చెందిన నిర్వాసితులు ముంబై, పూణె తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారుల ప్రత్యేక కమిటీకి కేవలం 2వేల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
దాదాపు 8వేల దరఖాస్తులు తగ్గాయి. వీరిలో చాలా మంది వయస్సు దాటిపోవడం చేత కూడా అర్హత సాధించలేకపోయారు. ఇంకా ఆలస్యమయ్యే కొద్ది మరింత తగ్గిపోయే ప్రమాదముంది.
నేతల అలసత్వం...
ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 65 గ్రామాలు ముంపునకు గురికాగా.. కర్నూలు జిల్లాలో 38 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే కర్నూలు జిల్లాకు చెందిన దాదాపు 2,750 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ల భించాయి. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉ న్నప్పుడు 2వేల మందికి ఉద్యోగ అవకాశం లభించింది. మిగతా వారికి కూడా అవకాశం ఇ వ్వాలంటూ 2013లో నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి నిరాహారదీక్ష చేసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి 750 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం 30 ఏళ్లలో 105 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం కలిగింది. ఇలా జిల్లా ముంపు బాధితులను పట్టించుకునే నాధుడు లేకపోవడంతో అడుగడునా వివక్ష కొనసాగుతూనే ఉంది.
ముంచేశారు...!
Published Sun, Apr 19 2015 1:39 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement