సాక్షి, కరీంనగర్ : కరీంనగర్‌పై ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని.. అందుకే నలుగురితో పాటు మరొకరికి క్యాబినెట్ హోదా పదవి ఇచ్చినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. తొలి విడతలో మంత్రి పదవి ఆశించానని.. రెండో విడతలో అవకాశం రావడంతో తన జీవితకాలంలో రక్తం ధారపోసి పార్టీ కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ గంగుల విలేకరులతో మాట్లాడుతూ...తనకు కేటాయించిన పౌర సరఫరాల శాఖను నెంబర్ వన్‌గా చేస్తానని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి ఫలితాలు రాబట్టేలా సహకరించాలని విఙ్ఞప్తి చేశారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశా..
‘కరీంనగర్‌లో వరుసగా గెలిచిన చరిత్ర ఏ నాయకుడికి లేదు. ఆ అదృష్టం నాకు దక్కింది. నగర ప్రజలకు రుణపడి ఉంటా. మచ్చలేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశాను. నావల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తా. సంతృప్తిని ఇచ్చే శాఖ ఇచ్చారు. కాబట్టి సీఎం కేసీఆర్ ముఖంలో అనునిత్యం నవ్వు కనిపించేలా పనిచేస్తా. టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కేసీఆర్ స్పూర్తితో.. టీడీపీలో తెలంగాణ వాదాన్ని వినిపించి పార్టీని వీడిన మొదటి ఎమ్మెల్యే నేను. కేసీఆర్‌ను చూస్తే ముఖ్యమంత్రిలాగా కనిపించడు.. ఓ డిక్షనరీగా కనిపిస్తాడు. గొప్ప మానవతావాది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి. 2018లో ఆయన బొమ్మతో గెలిచాము. రేపు ఏ ఎన్నికలు జరిగినా కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తాం’ అని గంగుల పేర్కొన్నారు.
ఇక తన నియోజకవర్గం గురించి మాట్లాడుతూ...‘కరీంనగర్‌లో స్మార్ట్ సిటి పనులు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. స్మార్ట్ సిటి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దే. నగరంలో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. రెట్టింపు అభివృద్ధి చేస్తాం. దసరాకు ఐటీ టవర్ కంప్లీట్ చేసి, 3600 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. బిజినెస్ సెంటర్‌గా, పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌ను నెంబర్ వన్ చేస్తాం. గత పాలకులకు ఇవన్నీ ఎందుకు కనిపించలేదు. పార్టీ లైన్‌లో కార్యకర్తలు పనిచేయాలని కోరుతున్నా. మానేర్ రివర్ ఫ్రంట్ రూ. 506 కోట్లకు జీవో ఇచ్చారు. ఈసారి అదే ఎమౌంట్ ఈ బడ్జెట్‌లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ కోసం కేంద్రం నుంచి ప్రయత్నిస్తున్నాం. నా శాఖలపై త్వరలో పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటా. నాణ్యత లోపించినా, అవినీతి పనులకు పాల్పడినా సీరియస్ యాక్షన్ తప్పదు అని మంత్రి గంగుల హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment