రైతుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే..
* కోలుకొండ గుట్టల పట్టా రద్దు చేయాలి
* తెలంగాణ యునెటైడ్ ఫోరం కోచైర్‌పర్సన్ విమలక్క
కడవెండి(దేవరుప్పుల) : రైతుల ఆత్మహత్యలు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, తెలంగాణ కల సాకారం కావాలంటే సహజ వనరుల పరిరక్షణ కోసం పోరాటాలు చేయూల్సిందేనని తెలంగాణ యునెటైడ్ ఫోరం కో చైర్‌పర్సన్ విమలక్క పిలుపునిచ్చారు. ఉద్యమాల పురిటిగడ్డ కడవెండిలో తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నేటి తెలంగాణ సాధన అమరులకు అరుణోదయ కళాకారులు కళారూపాలతో లాల్ సలామ్ తెలిపారు. శనివారం రాత్రి దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం నుంచి పీపుల్స్‌వార్ అమరులు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, పైండ్ల వెంకటరమణ స్మారక స్థూపాల నుంచి హైస్కూల్ వరకూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అరుణక్క రచించిన గోదావరిలోయ గోగుపూలు(గోదావరిలోయ మహిళా అమరుల సంక్షిప్త పరిచయం) పుస్తకాన్ని పెద్ది పిచ్చమ్మ, విమలక్క, రామలింగం కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం గా తెలంగాణ రైతాంగ సాయధ పోరాటం నుంచి నేటి తెలంగాణ సాధన విముక్తి పోరులో ప్రాణాలర్పించిన అమరుల ఆశయం నేరావేరాలంటే ఆర్థిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణం జరగాలన్నారు. కోలుకొండ గుట్టలను వారసత్వం పేరిట దొంగ పట్టాలు చేసి మెట్ట భూమిగా సీమాంధ్రకు చెందిన గ్రానైట్ మాఫియా చేతిలో పెట్టడం దారుణమన్నారు. స్థానిక సర్పంచ్ సుడిగెల హన్మంతు, నిర్మలక్క, దొడ్డి బిక్షపతి, బత్తుల సత్తయ్య, కె.రామలింగం, పీఓడబ్ల్యూ కరుణ పాల్గొన్నారు.