కలెక్టరేట్/నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు వద్ద ప్రత్యేక బందోబస్తు చేపట్టినట్లు డీఐజీ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కర్ణాటకలోని బీదర్ జిల్లా ఎస్‌పీ, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఎస్‌పీ, రాష్ట్రంలోని ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల ఎస్‌పీలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఏప్రిల్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పోలింగ్ రోజు పౌరులు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బందోబస్తు, అరెస్టు వారెంట్ల విషయంలో ఇరు జిల్లాల పోలీసులు ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని ఎస్‌పీలకు సూచించారు.
ఇరు ప్రాంతాలలో సంఘ విద్రోహ శక్తుల విషయమై ముందస్తు సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆయుధాలు రానివ్వకుండా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. చెక్ పోస్టులలో సిబ్బందిని అవసరమైన మేరకు నియమించుకోవాలని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలలో పాత నేరస్థులపై నిఘా పెట్టాలన్నారు.
సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఎస్‌పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ జిల్లాలోకి పొరుగు జిల్లాల నుంచి మద్యం, డబ్బు, మత్తుపదార్థాల తరలింపును అరికట్టేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఘటనలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్న, మెదక్ ఎస్‌పీ డాక్టర్ శిమెషీ బాజ్‌పాయ్, ఆదిలాబాద్ ఎస్‌పీ డాక్టర్ గజారావ్ భూపాల్, నాందేడ్ ఎస్‌పీ పరమ్‌జీత్‌సింహ దహియా, బీదర్ ఎస్‌పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, బీదర్ అడిషనల్ ఎస్‌పీ సంగీత, ట్రెయినీ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్, జిల్లా అదనపు ఎస్‌పీ పాండునాయక్, ప్రదీప్‌రెడ్డి, జిల్లాలోని డీఎస్‌పీలు అనిల్‌కుమార్, ఆకుల రామ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, తాజ్‌ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దుల్లో బందోబస్తు
Published Sat, Mar 15 2014 2:22 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement