♦ ఎన్నికల హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్ ప్రభుత్వం
♦ బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్
ఆర్మూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని బీజేపీ శాసన సభాపక్ష నేత, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని దోంచంద, గుమ్మిర్యాల పుష్కరఘాట్లను సందర్శించిన అనంతరం ఆయన ఆర్మూర్‌లో ఆగారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కె .లక్ష్మణ్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటూ లాభపడాలనే కుట్రలు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి పుష్కరఘాట్ల వద్ద సౌకర్యాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకాస్త ముందుగా చొరవ తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లభించక కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, ద్యాగ ఉదయ్‌కుమార్, పూజ నరేందర్, పొల్కం వేణు, పాల భాస్కర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ ఫిరాయింపులపైనే కేసీఆర్‌కు శ్రద్ధ
Published Fri, Jul 24 2015 4:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement