వీడిన యువకుడి హత్య మిస్టరీవనపర్తి
రూరల్: ఈనెల 17న మండలంలోని నాగవరం శివారులో వెలుగుచూసిన ఓ యువకుడి దారుణహత్య మిస్టరీని వనపర్తి రూరల్ పోలీసులు ఛేదించారు. హత్యకుగురైన మణ్యంను అతడి సోదరుడే(చిన్నాన కొడుకు)హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. మృతుడు మణ్యం, వనపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రాఘవేందర్ వరుసకు అన్నదమ్ములు. రాఘవేందర్ సొంత తమ్ముడు భాస్కర్ గత మార్చిలో ఆత్మహత్యకు పాల్పడగా.. దీనికి మణ్యమే కారణమని అతని భావించాడు. దీంతో మణ్యంపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హతమార్చాలని తలంచి తనభార్య తరఫు బంధువులు, కొత్తకోట మండలం మదనాపురం గ్రామానికి చెందిన వల్లెపు కురుమూర్తి, ద్యారంగుల మణికంఠ, కుంచెపు కురుమూర్తిలతో హత్యకు వ్యూహరచన చేశాడు. ఈనెల 16న రాత్రి మణ్యంతో కలిసి మద్యం సేవించారు. ఇంతలో పక్కనే ఉన్న మణ్యంను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు.
పట్టించిన ఫోన్‌కాల్
రంగంలోకి దిగిన పోలీసులు మణ్యం దారుణహత్య కంటే ముందు అతని ఫోన్‌కు వచ్చిన నంబర్లను సేకరించారు. పథకం ప్రకారం మణ్యంను లక్ష్యంగా చేసిన హోంగార్డు రాఘవేందర్ ముందస్తుగా తనఇంటి పక్కనే నివాసం ఉండే చెన్నమ్మ అనే మహిళగుర్తింపుకార్డుతో ఒక సిమ్‌కార్డును తీసుకున్నాడు. ఆ నంబర్ నుంచి కేవలం మణ్యంతో మాత్రమే మాట్లాడేవాడు. మణ్యం హత్య తరువాత ఈ నంబర్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. చివరికి రాఘవేందరే నిందితుడని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తులు, మద్యం సీసాలను పోలీసులు చూపించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. హత్యకేసును ఛేదించిన వనపర్తి రూరల్ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, రాయుడు, కృష్ణసాగర్, రాంచందర్‌కు వనపర్తి డీఎస్పీ జోగు చెన్నయ్య రికార్డు అందజేశారు.