సోనియాతో మల్లు రవి భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వివరించినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో సోనియా గాంధీతో మల్లు రవి భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అధికార టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, రైతులు ఆత్మహత్యలు తదితర అంశాలు సోనియాగాంధీకి వివరించినట్లు ఆయన చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను సోనియాకు విశదీకరించినట్లు మల్లు రవి తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా... ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 119 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కేవలం 21 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే 17 లోక్ సభ స్థానాలకు గాను కేవలం 2 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అదికాక టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు చాలా మంది కారు ఎక్కేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీన పడింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది.