సాక్షి, ఖమ్మం: పురపోరు ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి పుంజుకుని సాయంత్రానికి ముగిసింది. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల పరిధిలో సగటున మొత్తం 75.6 శాతం పోలింగ్ నమోదైంది. మధిరలో అత్యధికంగా 84.27శాతం, కొత్తగూడెంలో అత్యల్పంగా 71.44 శాతం నమోదైంది. మొత్తం 1,35,235 ఓట్లకు..1,02,309 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదైందని రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు పోలింగ్ జరుగుతున్నా మరోవైపు అభ్యర్థులు చివరి పోరాటంగా ఓటర్లకు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు, మద్యం పంపిణీ చేశారు. అంతేకాకుండా ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వార్డులో తమకే ఓటేయాలని కొత్తగూడెంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. పోలింగ్ ముగిసిన తర్వాత భారీ భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. కొత్తగూడెంలో సింగరేణి మహిళా కళాశాల, ఇల్లెందులో 24 ఏరియా యూపీఎస్, సత్తుపల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మధిరలో రిక్రియేషన్ క్లబ్‌లో ఈవీఎంలను భద్రపరిచారు.
‘గూడెం’లో మొరాయించిన ఈవీఎంలు..
కొత్తగూడెంలో పోలింగ్ ప్రారంభం కాకముందే 12వ వార్డులో ఈవీఎం మొరాయించింది. ఆ ఈవీఎం స్థానంలో ప్రత్యామ్నాయంగా మరొకటి ఏర్పాటు చేశారు. దీంతో అర్ధగంట ఆలస్యంగా 7.30 గంటలకు ఇక్కడ పోలింగ్ ప్రారంభమైంది. అలాగే 33, 14వ వార్డుల్లో కూడా ఈవీఎంలు మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత.. అప్పటికే పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన 25వ వార్డులో కొంతమంది ఓటర్లు సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేశారు. 20వ వార్డులో సుమారు 50 మంది సింగరేణి అధికారుల ఓట్లు జాబితాలో లేవు.
ఉత్సాహంతో ఓటు వేయడానికి వారు వచ్చినా జాబితాలో పేర్లు లేవని ఎన్నికల సిబ్బంది వారిని ఓటు వేయడానికి నిరాకరించడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ ముగిసినట్లు తనకు చెప్పకుండానే కేంద్రాన్ని మూసేశారని 6వార్డు సీపీఎం అభ్యర్థి పోలింగ్ కేంద్రం ముందు ఆందోళన చేశారు. ఎన్నికలను నిబంధనలను బేఖాతర్‌చేసి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చి పాతకొత్తగూడెంలో డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవ ప్రచారం నిర్వహించారని ఇతర పార్టీల నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే 32వ వార్డు పోలింగ్ కేంద్రం సమీపంలో ఎక్కువ మందితో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని) ప్రచారం నిర్వహిస్తుండగా పోలీసులు అక్కడి నుంచి అతన్ని పంపించేశారు.
మడుపల్లిలో సొమ్మసిల్లిన ఓటర్లు..
మధిర నగర పంచాయతీ పరిధిలోని మడుపల్లి వార్డుకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 11 గంటల తర్వాత ఓటర్లు భారీగా తరలిరావడంతో గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. దీంతో ఎండ తీవ్రతతో క్యూలో నిల్చున్న మేడికొండ భూషయ్య, వెంకటేశ్లర్లు సొమ్మసిల్లి పడిపోయారు. గర్భిణులు, వికలాంగులకు ప్రత్యేకంగా క్యూ పెట్టకపోవడంతో వీరు కూడా గంటల తరబడి జనరల్ క్యూలో నిల్చోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధిరలో స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
ఇల్లెందులో గుర్తు తారుమారు..
ఇల్లెందులోని 2వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఉంగరం గుర్తు బదులుగా బీరువా గుర్తు రావడంతో సదరు అభ్యర్థి పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే పోలింగ్ సిబ్బంది గుర్తును సరిచేశారు. 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో పోల్ చిట్టీలు లేకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. 2వ వార్డులో పోలీసులు.. టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య కొంత సేపు వాగ్వివాదం జరిగింది.
సత్తుపల్లిలో...
సత్తుపల్లిలో 7.30 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉర్ధూ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వెళ్లి.. మళ్లీ దొంగ ఓట్లు వేసేందుకు ఇద్దరు మహిళలు రావటంతో ట్రైనీ డీఎస్పీ నాగేశ్వరరావు అడ్డుకొని మందలించి పంపించారు. పాత సెంటర్ యూపీఎస్ పాఠశాలలో 2వ వార్డులో ఓ వ్యక్తి దొంగ ఓటు వేసేందుకు రావటంతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి చవ్వా స్వరూపారాణి అభ్యంతరం తెలపటంతో వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో అక్కడ కొద్దిసేపు ఉధ్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం మీద పురపోరు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఓటర్లపై సూర్యప్ర‘తాపం’..
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లపై సూర్యప్ర‘తాపం’ తప్పలేదు. ఉదయం 11 గంటల నుంచి నాలుగు చోట్లా పోలింగ్ పుంజుకుంది. ఎండ వేడికి ఓటర్లు తాళలేకపోయారు. మధ్యాహ్నమే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడంతో ఓటర్లు భారీ క్యూలో నిల్చొని అలిసిపోయారు. ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో మహిళా, పురుష ఓటర్లు బారులు తీరారు. కొత్తగూడెంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటేశారు.
మున్సి‘పోల్’ ప్రశాంతం
Published Mon, Mar 31 2014 1:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement