
విధుల్లోకి వెళ్తున్న కార్మికులు
సాక్షి, ఆసిఫాబాద్: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించగా.. సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను బేఖాతరు చేసింది. ఆదివారం కార్మికులు యథావిధిగా విధులకు హాజరుకావడం స్థానికంగా వివాదాస్పదమైంది. ఉదయం 6 గంటల షిఫ్టులో పేపర్ మిల్లులోకి దాదాపు 300 మంది కార్మికులు పనులకు వెళ్లారు. దీనిపై కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మ ధ్యాహ్నం 2 గంటల షిఫ్టు కార్మికులు విధుల్లోకి వెళ్లలేదు. జనతా కర్ఫ్యూ పాటించకపోవడంపై కంపెనీ జీఎం (ఐఆర్) అలోక్ శ్రీవాత్సవ స్పందిస్తూ అత్యవసర విభాగాలైన విద్యుత్, నీటి సరఫరా, బాయిలర్ కొనసాగింపు పనుల్లో కొంత మంది కార్మికులు హాజరయ్యారని పేర్కొన్నారు.
జనతా కర్ఫ్యూకు వ్యతిరేక ప్రచారం
సంగారెడ్డి అర్బన్: జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లపైకి రావాలని ప్రధాన మంత్రిపై తీవ్ర పదజాలంతో ప్రజలను రెచ్చగొట్టిన సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదైంది. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి వివరాల ప్రకారం.. ప్రధాని మోదీపై అసభ్య పదజాలంతో ఈ నెల 21న సాయంత్రం మహ్మద్ షమీ(34వ వార్డు కౌన్సిలర్), మహ్మద్ ఆర్ఫాత్, వాహిద్‌బీన్ అహ్మద్‌లు కలసి వీడియో రికార్డింగ్ చేసి వాట్సాప్‌లో పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా, ప్రజల మధ్య విదేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మహ్మద్ షమీపై గతంలో మత అల్లర్లలో నేర చరిత్ర ఉంది.