నిజామాబాద్ కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు, సంగారెడ్డి కలెక్టర్ ఎం.హన్మంతరావు
‘‘మీ జిల్లాలోని ఇసుక క్వారీల నుంచి కాస్త ఇసుక ఇవ్వండి..’’
– ఇది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు పక్షం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావుకు రాసిన లేఖ సారాంశం.
‘‘ఇక్కడ ఇసుక అందుబాటులో లేదు.. మా జిల్లా నుంచి ఇసుక ఇవ్వడం వీలు కావడం లేదు..’’
– ఇది జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు ప్రత్యుత్తరం..?
సాక్షి, నిజామాబాద్: సంగారెడ్డి జిల్లా పరిధిలో నల్లవాగు ప్రాజెక్టు ఉంది. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ పనులు చేపట్టాలంటే ఆ జిల్లాలో ఇసుక అందుబాటులో లేదు. దీంతో అక్కడి కలెక్టర్ హన్మంతరావు మన జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావుకు పక్షం రోజుల క్రితం లేఖ రాశారు. కోటగిరి మండలం పరిధిలోని కుమ్మరివాగు నుంచి ఇసుక తోడుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మొత్తం 9,500 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని రాశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎంరావు స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని భూగర్భ గనుల శాఖను పురమాయించారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన ఆశాఖ అధికారులు అక్కడ ఇసుక అందుబాటులో లేదని, అక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లడం కుదరదని తేల్చి చెప్పారు. ఈమేరకు ఇక్కడ ఇసుక లేదని నిజామాబాద్ కలెక్టర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment