సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:
సామాజిక పింఛన్ల లబ్ధిదారుల జాబితాలో భారీగా కోతలు పడనున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. దరఖాస్తుల్లో సుమారు 40శాతం మేర నిబంధనలకు అనుగుణంగా లేనట్లు పరిశీలక బృందాలు తిరస్కరిస్తున్నాయి. గతంలో మంజూరైన పింఛన్లతో సంబంధం లేకుండా నూతన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు నిర్ధేశిత గడువులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయడం సాధ్యమయ్యేలా లేదు.
ఈనెల 8వ తేదీలోగా లబ్ధిదారులకు పింఛను మంజూరుపత్రాలు అందజేయాలనే లక్ష్యం కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు కోసం జిల్లాలో 5.55లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 30లోగా దరఖాస్తులను పరిశీలించి అర్హులజాబితాను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. దరఖాస్తుల పరిశీలనకు మండలస్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించారు. ఇప్పటివరకు 4.98లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తికాగా, మరో 56,983 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది.
ఉరుకులు.. పరుగులు
సామాజిక పింఛన్ లబ్ధిదారులకు ఈనెల 8న నగదు రూపంలో పింఛన్ మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తికాకపోవడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. దరఖాస్తుల వడపోత అనంతరం అర్హులైన లబ్ధిదారులను జాబితాను ఆన్‌లైన్‌లో కంప్యూటరీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో ఈ నెల8వ తేదీలోగా మంజూరు పత్రాలు ఇవ్వడం అసాధ్యమమేనని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు.
నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలన, మంజూరు పత్రాల జారీప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉందని పర్యవేక్షిస్తున్న ఓ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా, దరఖాస్తుల వడపోత ప్రక్రియలో పెద్దఎత్తున అర్జీలను తిరస్కరిస్తున్నారు. సుమారు 30నుంచి 40శాతం మేర దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు ‘సాక్షి పరిశీలనలో తేలింది. నిబంధనలను సాకుగా చూపుతూ గతంలో పింఛన్ పొందినవారి పేర్లను కూడా తొలగిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
లబ్ధిదారుల జాబితాలో కోత?
వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు వివిధ కేటగీరీల కింద ప్రస్తుతం జిల్లాలో 4.59లక్షల మంది పింఛన్లు పొందుతుండగా.. తాజాగా 5.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్య పింఛన్లలో వయసు నిర్ధారణకు ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో చాలామందిని ‘అండర్ ఏజ్’ అంటూ తొలగిస్తున్నారు. మరోవైపు వితంతు పింఛన్ల విషయంలో భర్త మరణధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తొలుత నిబంధన విధించిన అధికారులు ఆ తర్వాత కాస్త సడలించారు.
ప్రస్తుతం సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నా లబ్ధిదారుల్లో ఎంపికతీరుపై నిరసన వ్యక్తమవుతోంది. సదరం ధ్రువీకరణపత్రాల్లో 40శాతం కంటే ఎక్కువ వైకల్యాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. మరోవైపు అర్హత ఉండి సదరం సర్టిఫికెట్లు లేని దరఖాస్తుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పరిశీలనకు వస్తున్న బృందాలు విచారణ అనంతరం జాబితాను వెల్లడించకపోవడంతో తమ పేరు ఉందో, గల్లంతైందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
దరఖాస్తుల పరిశీలన తీరుతెన్నులను పరిశీలిస్తే లబ్ధిదారుల జాబితాలో కోతపడడం ఖాయంగా కనిపిస్తోంది. అనర్హులను ఎంపికచేస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు ఉంటాయని ప్రకటించడంతో పరిశీలనకు బృందాలు కూడా తీవ్రఒత్తిడికి లోనవుతున్నాయి.
లోకుర్తిలో తగ్గిన లబ్ధిదారులు
దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామంలో పింఛను దరఖాస్తుల ప్రక్రియను ‘సాక్షి’ పరిశీలించింది. దరఖాస్తుల్లో 31శాతం మేరకు తిరస్కరణకు గురైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పింఛను పొందుతున్న వారి సంఖ్యతో పోలిస్తే 15మంది పేర్లు జాబితాలో కనిపించడం లేదు.
పింఛన్.. దరఖాస్తులు
దామరగిద్ద మండలం లోకుర్తిలో పింఛన్ దరఖాస్తులు ఇలా..
కేటగిరీ ప్రస్తుత అందిన అర్హులుగా
పింఛన్లు దరఖాస్తులు తేలినవి
వృద్ధాప్య 153 190 110
వితంతు 72 110 97
వికలాంగ 12 15 15
మొత్తం 237 321 222
పింఛన్.. ఫట్
Published Sun, Nov 2 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement