రెడ్ అలర్ట్ | police inspections in districts | Sakshi
Sakshi News home page

రెడ్ అలర్ట్

Published Tue, Dec 2 2014 3:48 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

రెడ్ అలర్ట్ - Sakshi

రెడ్ అలర్ట్

చింతగుహ ఘటనతో జిల్లాలో పోలీసుల తనిఖీలు
సరిహద్దులో నిఘా ముమ్మరం చేసిన బలగాలు
దండకారణ్యంలో నేటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు
ఏజెన్సీలో అలుముకున్న యుద్ధ మేఘాలు
 సాక్షి, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా చింతగుహ ఘటనతో జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఏక్షణాన ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఏజెన్సీ బలగాలను యుద్ధానికి సిద్ధం చేసింది. కాగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలు విజయవంతం చేయాలని దండకారణ్య కమిటీ పిలుపునిచ్చింది. దీంతో ఇటీవల భద్రాచలం ఏజెన్సీ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోస్టర్లు, కరపత్రాలతో విసృ్తతంగా మావోయిస్టులు ప్రచారం నిర్వహించారు. అయితే మంగళవారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కానుండడంతో చింతగుహలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 11 మంది జవాన్లు, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ అధికారులు మృతి చెందడంతో జిల్లా పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
 
పీఎల్‌జీఏ వారోత్సవాలను ఈసారి మావోయిస్టు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా వీటిని విజయవంతం చేయాలని దండకారణ్య కమిటీ ఇచ్చిన పిలుపుతో గత పది రోజులుగా ఏజెన్సీలో చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, చింతూరు మండలాల పరిధిలోని గిరిజన, ఆదివాసీల గూడేల్లో వెంకటాపురం, దుమ్మగూడెం, శబరి ఏరియా కమిటీల ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఏకంగా చర్ల, వెంకటాపురం మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లకు సమీపంలోనే మావోయిస్టులు పోస్టర్లు వేసి పోలీసులకు సవాల్ విసిరారు.

ఈ పరిస్థితులతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గత వారం రోజులుగా సంతలు, ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలు, వ్యక్తులను సోదాలు చేస్తున్నారు. గతంలో ఈ వారోత్సవాలపై అంతగా దృష్టి పెట్టని మావోయిస్టు పార్టీ ఈ సారి ఏకంగా ఏజెన్సీ అంతా ప్రచారం చేసి తమ ప్రాబల్యాన్ని చాటుకుంది. కేకేడబ్ల్యూ (కరీంనగర్, ఖమ్మం, వరంగల్), శబరి ఏరియా కమిటీలు ఎన్‌కౌంటర్లలో తుడిచి పెట్టుకపోయాయని, మావోయిస్టుల ప్రాబల్యం ఇక జిల్లాలో తగ్గిందని పోలీసులు ప్రకటించినా.. కొంతకాలం తర్వాత రిక్రూట్‌మెంట్లతో జిల్లాలో మళ్లీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు.

పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయడంతో పాటు ఏదైనా సంఘటనకు పాల్పడి తమ సత్తా చాటాలన్న వ్యూహంలో భాగంగానే చింతగుహలో భారీ ఎత్తున దాడికి పాల్పడినట్లు సమాచారం. కూంబింగ్ పార్టీపైనే 200 మందికి పైగా మావోయిస్టులు దాడి చేయడంతో జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్లకు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇటీవల బలపడిన ఈ కమిటీలు తమ సత్తా చాటేందుకు చింతగుహ ఘటనతో ఏజెన్సీలో దాడికి పాల్పడే అవకాశం ఉందని జిల్లా పోలీస్ వర్గాలకు సమాచారం ఉంది.
 
8 వరకు వారోత్సవాలు..
పీఎల్‌జీఏ వారోత్సవాలను ఈ నెల 2 నుంచి 8 వరకు నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ సన్నద్ధమైంది. ఇన్‌ఫార్మర్లకు శిక్ష తప్పదని, భూస్వాముల కంబంధ హస్తాల్లో ఉన్న భూములను స్వాధీనానికి ఆదివాసీలతో పోరాటం చేస్తామని ఇప్పటికే జిల్లా కమిటీ హెచ్చరించింది. ప్రజాప్రతినిధుల, రియల్టర్ల భూములు స్వాధీనం చేసుకున్నారని కొంతమంది పేర్లతో కరపత్రాలను కూడా విడుదల చేసింది. తొలిసారి జిల్లాలో ఇలా మావోయిస్టులు ప్రజాప్రతినిధుల పేరుతో కరపత్రాలు విడుదల చేయడంతో వారిని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇప్పటికే సూచించారు.

వారోత్సవాల నేపథ్యంలో ఇటు పోలీస్ ఇన్‌ఫార్మర్లను తుద ముట్టించడంతో పాటు అటు రిక్రూట్‌మెంట్లపై మావోయిస్టు పార్టీ కన్నేసినట్లు సమాచారం. ఏడు రోజుల పాటు జరగనున్న ఈ వారోత్సవాల్లో ఎక్కువగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మండలాల్లో ప్రభావం చూపనుండడంతో జిల్లాకు చెందిన పోలీసు బలగాలు కూడా కూంబింగ్ ముమ్మరం చేశాయి. కానీ చింతగుహ ఘటనతో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యాయి.
 
సరిహద్దులో యుద్ధ మేఘాలు..
వారోత్సవాలు ముగిసే లోపే మావోయిస్టులు ఏదైనా భారీ సంఘటనకు పాల్పడుతారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను హెచ్చరించాయి. అయితే ప్రారంభానికి ముందురోజే పంజా విసరడంతో జిల్లాలో కూడా ఏదైనా సంఘటనకు పాల్పడే అవకాశం ఉండడంతో ఏజెన్సీలో యుద్ధ వాతావరంణం నెలకొంది. చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, చింతూరు, పినపాక, గుండాల, వాజేడు ప్రాంతాల్లో వారం రోజులుగా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఖమ్మం, భద్రాచలం బస్టాండ్లలో కూడా తనిఖీలు చేశారు. ఈసంఘటనతో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. సుక్మా జిల్లా, కుంట బ్లాక్, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మపేటలో ఓ బేస్‌క్యాంపు నిర్మాణానికి వారం రోజుల క్రితం పోలీసు బలగాలు శ్రీకారం చుట్టాయి. దీనిని వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు గత నాలుగు రోజులుగా బేస్‌క్యాంపు నిర్మాణం ప్రాంతంలో పహారాగా వున్న పోలీసులపుపై కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ క్యాంపు ఏర్పాటయితే తమ ఉనికికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో మావోయిస్టులు క్యాంపు నిర్మించకుండా దాడులకు పాల్పడుతున్నారు.

అంతేకాకుండా ఈ బేస్ క్యాంపునకు ఇసుక తరలిస్తున్న లారీని ఇటీవల తగులబెట్టారు. ప్రస్తుతం చింతగుహ ఘటన దండకారణ్య కమిటీ నేతృత్వంలో జరిగినట్లు సమాచారం. ఈ కమిటీకి రామన్న సారథ్యం వహిస్తుండంతో ఆయన సూచనలతో జిల్లా సరిహద్దు మండలాల్లో వెంకటాపురం, శబరి, దుమ్ముగూడెం ఏరియా కమిటీలు ఏదైనా సంఘటనలకు పాల్పడే అవకాశం ఉంది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆధిపత్యం చాటుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నించడం, వాటిని తిప్పికొట్టడానికి పోలీసులు సన్నద్ధం కావడంతో ఆదివాసీలు, గిరిజనులకు కంటిమీద కనుకులేకుండా పోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement