
‘మధ్యమానేరు’కు కదలిక
ఆగిన ప్రాజెక్టుకు పరుగులు
సీఎం సమీక్షలో నిర్ణయం
{పాణహిత-చేవెళ్లతో లింక్
సాగు, తాగునీటికి కొత్త ఆశలు
అర్ధంతరంగా ఆగిన మధ్యమానేరు ప్రాజెక్టుకు ప్రాణం పోసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మిడ్‌మానేరు వరకు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో మిడ్‌మానేరు ప్రాజెక్టుపై కొత్త ఆశలు చిగురించాయి. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వటంతో అందులో అంతర్భాగమైన మిడ్ మానేరుకు జవజీవం పోసినట్లయింది. నత్తనడకన సాగుతున్న పనులు వేగం పుంజుకోనున్నాయి. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయుజ్ఞంలో భాగంగా జిల్లాలో మిడ్ మానేరు ప్రాజెక్టును తలపెట్టారు. మెట్ట ప్రాంతంలోని రైతులను ఆదుకునేందుకు ఎనిమిదేళ్ల కిందట పనులు ప్రారంభించారు. కానీ కాంట్రాక్టర్ల గిమ్మిక్కులతో ఈ జలాశయు నిర్మాణం పునాదుల్లోనే ఆగిపోయింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 18 మండలాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. దీంతో సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాలు, 157 గ్రామాలకు సాగునీరు, తాగునీటి సమస్య తీరిపోనుంది. బోయినపల్లి మండ లం మాన్వాడ వద్ద 25.873 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు 2006లో మిడ్‌మానేరు జలాశయానికి అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు. మొదటిసారి రూ.339.39 కోట్లకే పనులు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీ అడ్వాన్సులు తీసుకొని చేతులెత్తేసింది. నిదానంగా తేరుకున్న సర్కారు నాలుగేళ్ల తర్వాత రూ.454 కోట్ల అంచనాలతో మరోసారి టెండర్లు పిలిచింది. 20 శాతం లెస్‌కు రూ.360.90 కోట్లకు ఎంఎస్ ఎస్‌ఏపీఎల్, అండ్ ఎంబీఎల్, ఐవీఆర్సీఎల్ అనే సంస్థలు జాయింట్ వెంచర్‌లో పనులు దక్కించుకున్నారుు. 2012 ఏప్రిల్ 23న మంత్రులు శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి రెండో దఫా పనులను ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం 2015 ఏప్రిల్ నాటికి రిజర్వాయుర్ నిర్మాణం పూర్తి కావాలి. కానీ.. ఇప్పటికీ 20 శాతం పనులు పూర్తి కాలేదు.
ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ పరిసరాల్లో స్పిల్‌వే నిర్మాణంలో ఉంది. రిజర్వాయుర్‌కు 25 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ పనుల్లో బాగంగా క్రాస్ రెగ్యులేటర్లు, రెండు తూము లు నిర్మించాల్సి ఉంది. బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లె వద్ద కట్ట నిర్మాణం జరిగింది. మానేరు అవతలి వైపు ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లె, సిరిసిల్ల మం డలం చీర్లవంచ వైపు కట్ట నిర్మించారు. ప్రధాన కట్ట నిర్మాణం కొంత మేరకు పూర్తికాగా.. రాతి కట్టడాలు (రివిట్‌మెంట్) పూర్తి కాలేదు. కోట్ల రూపాయలతో జలాశయం చుట్టూ నిర్మిం చిన కట్టలు కనపడకుండా చెట్లు, పిచ్చిమొక్కలు, ముల్లపొదలు ఏర్పడి నిర్వీర్యమై వాటి ఆనవాల్లే కనపడడంలేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో అడుగడుగునా కట్టలకు గండ్లు పడ్డా యి. శ్రీరాంసాగర్ మిగులు జలాలను సద్వినియోగం చేసేం దుకు ఎస్సారెస్పీ నుంచి గతంలో 122 కిలోమీటర్ల పొడవున వరద కాలువ పూర్తి చేశారు. ఈ కాల్వ ద్వారా వచ్చిన వరద నీటిని సైతంనిల్వ చేసేందుకు వీలుగా ఈ రిజర్వాయుర్ డిజైన్ చేశారు. జలాశయంలో ముంపునకు గురయ్యే సిరిసిల్ల మండలంలోని చీర్లవంచ, చింతల్‌ఠాణా, వేములవాడ మండలంలోని అనుపురం, కొడుముంజ, రుద్రవరం, సంకెపల్లి, బోయినపల్లి మండలంలోని వర్దవెల్లి, కొదురుపాక, నీలోజిపల్లె, శాభాష్‌పల్లి గ్రామాల్లో నిర్వాసితులకు పరిహారం అసంపూర్ణంగా అందింది. నిర్వాసితుల సమస్యలతోపాటు ఈ ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్యం.. నిధుల కేటాయింపు తీరును ఎండగట్టేందుకు గతంలో ఇదే రిజర్వాయర్ సమీపంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వంటావార్పు చేపట్టి ఆందోళన చేశారు. తాజాగా సీఎం హోదాలో కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ప్రాణహిత-చేవెళ్లతో లింక్ ఇలా..
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నుంచి 160 టీఎంసీలు, ఎల్లంపల్లి బ్యారేజీ సమీపంలో గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని మెట్టప్రాంతాలకు మళ్లించేందుకు డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. జలయజ్ఞంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును ప్రారంభించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీటిని, జంట నగరాలకు, ప్రాజెక్టు విస్తరించిన పరిధిలోని గ్రామాలకు తాగునీటిని, పారిశ్రామిక అవసరాలకు సైతం నీటిని అందించే బహుళ ప్రయోజనాలుండేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రాజెక్టును మొత్తం ఏడు లింక్‌లుగా విభజించారు.
మొదటి లింక్‌లో ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మెడిహట్టి సమీపంలో నిర్మించే ప్రాణహిత బ్యారేజీ నుంచి గోదావరిఖని సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. రెండో లింక్‌లో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలిస్తారు. మూడో లింక్‌లో మిడ్ మానేరు నుంచి గంభీరావుపేట సమీపంలో ఉన్న ఎగువ మానేరుకు, నాలుగో లింక్‌లో మిడ్ మానేరు నుంచి మెదక్ జిల్లాలోని పాములపర్తి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మిడ్ మానేరు వరకు ప్రాణహిత ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించటంతో.. జిల్లా పరిధిలో దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.