నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించాలి: జూపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: నిజాం సహకార చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని కోరినట్టు పరిశ్రమలు, చక్కెర, చేనేత, జౌళి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. చెరకు పరిశ్రమ, రైతుల సమస్యలపై రాష్ట్రాల మంత్రులతో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2008లో మూతపడిన నిజాం షుగర్‌ను పునరుద్ధరించడంతో పాటు క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచాలని కోరినట్టు అనంతరం విలేకరులకు తెలిపారు.
దేశంలో సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఒక పథకాన్ని ఏర్పాటు చేయాలని సూచించానన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను చెరకు క్రషింగ్‌కు వాడితే రైతుకు ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేల దాకా లబ్ధి చేకూరుతుందని, పరిశ్రమపైనా భారం పడదని అన్నారు. చక్కెర దిగుమతి సుంకాన్ని పెంచాలని, చెరకు మద్దతు ధరను రూ.2,200 నుంచి 3,200కు పెంచాలని సూచించానని చెప్పారు.