సమాజ మార్పునకు ఉద్యమాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సమాజం మార్పుకోసం సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం జిల్లా మహాసభలు మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని.. పేదల గురించి ఆలోచించకుండా బడా పెట్టుబడిదారులకు దాసోహ మైందని విమర్శించారు.
కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని.. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలను ఐ క్యం చేసి పోరాడుతామన్నారు. ప్రజాపోరాటాలు నిర్వహించడం ద్వారా అ ధికారంలోకి వస్తామని చెప్పారు. దేశం లో ఉన్న వారందరినీ హిందువులుగా మార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. టీడీపీ పక్క రాష్ట్రం పార్టీ అని.. కమ్యూనిస్టులు ఏ దేశంలోనైనా ఉన్నారన్నారు. ఎర్రజెండా లేని దేశం ప్రపంచంలోనే లేదన్నారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు, ఉపాధిహామీ చట్టం పకడ్బందీ అమలుకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు, కార్యవర్గ సభ్యురాలు జ్యోతి మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో 1600మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుకు వ్యవసాయాన్ని గిట్టుబాటుగా చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అండగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు.
దేశ వ్యాప్తంగా కేవలం 200 మండలాలకు పరిమితం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై పోరాటం చేయాల్సి ఉందన్నారు. కమ్యూనిస్టుల పోరాటం వల్లే ఉపాధి చట్టాన్ని సాధించుకున్నామని, ఆ చట్టం కోసం మరో పోరాటం చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పూర్తితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.
దళిత, గిరిజనులకు 3ఎకరాల భూమి ఇవ్వాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన నగదుబదిలీ పథకాన్ని మోడీ సర్కారు మళ్లీ తెచ్చిందని విమర్శించారు. సభలో పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బార్, నాయకులు కురుమూర్తి, రాములు, చంద్రకాంత్, బాల్‌రెడ్డి, పర్వతాలు, రమేష్, గీత, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కదం తొక్కిన ఎర్రదండు..
సీపీఎం జిల్లా మహాసభల సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీకి ఎర్రదండు కదిలివచ్చింది. వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. టౌన్‌హాల్‌నుంచి తెలంగాణ చౌరస్తా, డీఈఓ కార్యాలయం చౌరస్తా మీదుగా జెడ్పీ మైదానం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలతో ర్యాలీ సాగింది. మహిళలు బతుకమ్మ, బోనాలతో ర్యాలీల్లో కపాల్గొన్నారు. సభలో కళారూపాలు ఆకట్టుకున్నాయి.