
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ దేశంలోని అత్యధిక మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోందని.. అత్యంత క్లిష్టమైన కేన్సర్ల చికిత్సకూ ఇందులో అవకాశం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదని, తమదైన ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ లో కేన్సర్ చికిత్సను కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన ఇండియన్ కోఆపరేటివ్ ఆంకాలజీ నెట్‌వర్క్ (ఐకాన్) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై గవర్నర్ మాట్లాడారు. కేన్సర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి 42 ఏళ్లుగా కేన్సర్ విషయంలో విశేష కృషి చేస్తున్న ఐకాన్ సంస్థ ప్రజా చైతన్యం విషయంలో మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐకాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పర్వేశ్ పారీఖ్, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి డాక్టర్ సాయిరామ్, సీనియర్ ఆంకాలజిస్ట్ కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.
గవర్నర్ అధికారిక కార్యక్రమాలు రద్దు..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో శనివారం నుంచి తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment