గిరి‘జనం’ ఎటువైపు?  | Telangana Elections Tribals Voters Adilabad | Sakshi
Sakshi News home page

గిరి‘జనం’ ఎటువైపు? 

Published Sat, Dec 1 2018 9:40 AM | Last Updated on Sat, Dec 1 2018 9:42 AM

Telangana Elections Tribals Voters Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఆదివాసీల ఆందోళనలతో అట్టుడికిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, గిరిజనేతరులు ఎవరి పట్ల విశ్వాసం చూపుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మూడు ఎస్టీ రిజర్వుడు స్థానాలపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. ఈ మూడింట్లో తాజా మాజీ ఎమ్మెల్యేలే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, మూడు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ ఏరికోరి అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏడాది క్రితం ఆందోళనలతో అట్టుడికిన ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదివాసీలు, లంబాడాలు రెండు వర్గాలుగా విడిపోయిన ఏజెన్సీలో తమకు అండగా ఉంటారని భావించే అభ్యర్థులకే రెండు వర్గాలు మద్దతిచ్చే పరిస్థితి ఉంది.

ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని 31 మండలాల్లో 5లక్షలకు పైగా జనాభా గిరిజనులదే కాగా, వారిలో గోండులే 2.63 లక్షల మంది ఉండడం గమనార్హం. లంబాడా, కోయ,  పర్ధాన్‌ ఉప కులాలతో పాటు ఆదిమ తెగలకు చెందిన కొలాం, మన్నేవార్, తోటి వర్గాలు కూడా ఆదిలాబాద్‌ ఏజెన్సీలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఐదు నియోజకవర్గాలకు ఐటీడీఏ విస్తరించి ఉండగా, ఎస్టీ రిజర్వుడు స్థానాలైన బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్‌లలో అభ్యర్థుల విజయంలో మాత్రం గిరిజనేతరుల ఓట్లు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ఆదివాసీల భూసమస్యలు, పోడు వ్యవసాయం, గిరిజనేతరులకు పట్టాల విషయంలో 1/70 చట్టంతో ఇబ్బందులు, గిరిజనేతరులు క్రయ విక్రయాలకు నోచుకోకపోవడం వంటి అంశాలు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రైతుబంధు పథకంలో లబ్ధిదారుల కన్నా, ఎలాంటి సహాయం అందని వారే ఎక్కువగా ఇక్కడున్నారు. సాగు చేసుకునే రైతులకు కూడా 1/70 చట్టం కింద పట్టాలు లేని పరిస్థితి. 

ఆసిఫాబాద్‌లో ఆదివాసీల మధ్యే పోరు..
ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఆదివాసీలే. టీఆర్‌ఎస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ నుంచి ఆత్మారాం నాయక్‌ పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే నెలకొని ఉంది. ఆదివాసీ ఆందోళనల సమయంలో కోవ లక్ష్మి తటస్థ వైఖరి అవలంభించి, రెండు వర్గాలకు దూరం కాకుండా ఉన్నారు. అదే సమయంలో ఆత్రం సక్కు ఆదివాసీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

దీంతో ఆదివాసీలు అప్పట్లో సక్కు వైపే మొగ్గు చూపారు. ఈ నియోజకవర్గంలో ఆదివాసీలతో పాటు లంబాడాలు కూడా ఉన్నప్పటికీ, జనాభాపరంగా తక్కువే కావడంతో ఆదివాసీల ఓట్లే గెలుపు ఓటములను నిర్ణయించనున్నాయి. అదే సమయంలో భూమిపైన ఎలాంటి హక్కు లేకపోయినా, ప్రశాంత వాతావరణం కోరుకునే ఏజెన్సీల్లోని గిరిజనేతరులు ఎటువైపు మొగ్గితే విజయం అటువైపే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా రెండు వర్గాలను సమానంగా చూసిన తననే ఎన్నుకుంటారని కోవ లక్ష్మి ధీమాతో ఉన్నారు. ఆదివాసీలతో పాటు వారి హక్కుల కోసం సాగుతున్న పోరాటానికి మద్దతిస్తున్న గిరిజనేతరులు తనకు అనుకూలంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు భావిస్తున్నారు. 

బోథ్‌లో భయపెడుతున్న అనిల్‌జాదవ్‌..
బోథ్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాథోడ్‌ బాపూరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి సోయం బాపూరావుతో పాటు లంబాడా వర్గానికే చెందిన స్వతంత్ర అభ్యర్థి అనిల్‌ జాదవ్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఆదివాసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసీ నాయకుడు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావును అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఇక్కడ కాంగ్రెస్‌ టికెట్టు ఆశించి భంగపడ్డ అనిల్‌ జాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడంతో ముక్కోణపు పోటీ వాతావరణం ఏర్పడింది.

ఆదివాసీ ఓట్లే ఆయుధంగా సోయం బాపూరావు చక్రం తిప్పుతుండగా,  సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుపై సహజంగా ఉండే వ్యతిరేకత, లంబాడా ఓట్లను ఆకర్షిస్తూ అనిల్‌జాదవ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ఓట్లపైన రాథోడ్‌ బాపూరావు ఆశతో ఉన్నారు. స్థానిక ఎంపీ గోడం నగేష్‌ వర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సహకరించకపోవడం పెద్ద లోటు. ఈ నేపథ్యంలో బోథ్‌ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రెండు ప్రధాన పార్టీల పోరులో స్వతంత్ర అభ్యర్థి మార్గాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు సమాచారం.

ఖానాపూర్‌లో మారుతున్న సమీకరణలు
ఖానాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ పోటీ పడుతున్నారు. ఈ టికెట్టు ఆశించి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ పార్టీ మొండిచెయ్యి చూపడంతో కాంగ్రెస్‌లో చేరారు. రాథోడ్‌ రమేష్‌కు కాంగ్రెస్‌ టికెట్టు కేటాయించగా, ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన హరినాయక్‌ రెబల్‌గా బీఎస్‌పీ నుంచి బరిలో నిలిచారు. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల నుంచి లంబాడా వర్గానికి చెందిన వారే పోటీలో ఉండడంతో ఆదివాసీలు, గిరిజనేతరుల ఓట్లు కీలకం కానున్నాయి.

ఆదివాసీ వర్గానికి చెందిన అభ్యర్థులు ఇక్కడ ఏడుగురు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సట్ల అశోక్, టీజేఎస్‌ నుంచి తాట్ర భీంరావు తదితరులు ఎవరికి వారే ఆదివాసీల ఓట్లను గంపగుత్తగా వేసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆదివాసీల ఓట్లు ఇక్కడ చీలిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేఖా నాయక్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో గిరిజనేతరుల ఓట్లను తమనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో రేఖా నాయక్‌ ఉన్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలకు గుర్తింపుగా ఈసారి అవకాశం ఇస్తారనే యోచనతో రాథోడ్‌ రమేష్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement