ఉట్నూర్(ఖానాపూర్): ఖానాపూర్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలన్నీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. అయితే ఇక్కడ గిరిజనేతరుల ఓ ట్లు కీలకంగా మారడంతో బరిలో ఉన్న అభ్యర్థులంతా వీరి ఓట్లపైనే దృష్టి సారించారు. గిరిజనేతరులు అధికంగా ఉన్న ఖానాపూర్, జన్నారం, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరు ఎవరిని ఆదరిస్తే వారే విజయం సాధించనున్నారు.
టీఆర్‌ఎస్
అనుకూలతలు
- టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖానాయక్ సంక్షేమ పథకాలే లక్ష్యంగా ప్రచారం నిర్వహించడం.
- సదర్‌మాట్ బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేయడం.
- ఉట్నూర్‌లో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఉట్నూర్‌లో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.
- అలాగే ఐసీయూ, డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ వహించడం.
- ఉట్నూర్ మండలంలోని గోపాయి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడం. పార్కు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం రూ.3.71 కోట్లు కేటాయించి పనులు చేపట్టడం.
- ఖానాపూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం. మైనార్టీ, మినీ గురుకులాలు ఏర్పాటు చేయడం.
ప్రతికూలతలు
- నియోజకవర్గంలోని మండలాల్లో ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వకపోవడం. కొన్ని మండలాల్లో ఇళ్ల నిర్మాణాల పనులు అసలే ప్రారంభం కాకపోవడం.
- గత ఎన్నికల్లో ఖానాపూర్ మండల కేంద్రంలోని 110 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్లు లేని పేదలకు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం.
- ఉట్నూర్ మండలంలో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణంలో భాగంగా దాదాపు 300 కుటుంబాల మనుగడ ప్రశ్నార్థంగా మారడం. వారికి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం.
- ఉట్నూర్ కేంద్రంగా మంజూరైన గిరిజన యూనివర్సిటీ ఇతర జిల్లాకు తరలివెళ్లినా పట్టించుకోకపోవడం.
- కౌలు రైతుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత.
కాంగ్రెస్ అనుకూలతలు
- ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రాథోడ్ రమేశ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోనిలవడం.
- రాజకీయాల్లో ఉమ్మడి జిల్లాను శాసించే సత్తాతోపాటు ఖానాపూర్ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టుఉండటం.
- మొదటి నుంచి నియోజకవర్గంలో ఎవరి ఇంట్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా నేరుగా వెళ్లి కలవడం. వారి స్థితిని బట్టి మాట, ఆర్థిక సాయం అందించడం.
- గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీ చైర్మన్‌గా పదవుల్లో కొనసాగిన అనుభవం.
- గత నాలుగున్నర ఏళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం.
- ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసిరావడం.
ప్రతికూలతలు
- కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఉండడం.
- ఆదివాసీ ఉద్యమ నేపథ్యంలో ఆదివాసీల ఓట్లు ఎటు పడుతాయో తెలియని పరిస్థితి.
బీజేపీ అనుకూలతలు
- ఉట్నూర్ మండలం లక్సెట్టిపేట మాజీ సర్పంచ్ సట్ల అశోక్ బీజేపీ నుంచి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
- ఆదివాసీ ఉద్యమం నేపథ్యంలో ఆదివాసీ సంఘాలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం.
- ఆదివాసీ తెగకు చెందిన అభ్యర్థి కావడంతోపాటు వివాద రహితుడిగా పేరు ఉండటం.
ప్రతికూలతలు
- బీజేపీ నుంచి టికెట్ ఆశించిన పెందోర్ ప్రభాకర్ బీజేపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం.
- ఎక్కువ సంఖ్యలో ఆదివాసీ అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయడం.
- గిరిజనేతర ప్రాంతాల్లో పట్టులేకపోవడం.
Comments
Please login to add a commentAdd a comment