ప్రారంభమైన టీఎస్ సిరీస్ | The beginning of a series of fundamental | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన టీఎస్ సిరీస్

Published Thu, Jun 19 2014 3:36 AM | Last Updated on Wed, Oct 17 2018 5:04 PM

ప్రారంభమైన టీఎస్ సిరీస్ - Sakshi

ప్రారంభమైన టీఎస్ సిరీస్

సాక్షి, సిటీబ్యూరో: కొత్త రాష్ట్రంలో కొత్త సీరిస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల తరువాత రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో వాహనదారుల్లో ఆనందం వ్యక్తమైంది. మొన్నటి వరకు వాహనాల సిరీస్, కోడ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి నిరీక్షణ తప్పలేదు. కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనదారులు ఉత్సాహంగా ఆర్టీఏ కార్యాలయాలకు చేరుకున్నారు.

మొదటి రోజైన బుధవారం గ్రేటర్ పరిధిలో 967 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. విరామం తరువాత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో నగరంలోని ఖైరతాబాద్‌తోపాటు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, సికింద్రాబాద్, మెహదీపట్నం తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారుల రద్దీ కనిపించింది.  ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొట్టమొదటి నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0002’ను నగరంలోని రహమత్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడపాటి శివారెడ్డి తన స్విఫ్ట్‌డిజైర్ కోసం సొంతం చేసుకున్నారు.

మరో నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0003’ వేదాంత లైఫ్‌సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ‘టీఎస్ 09 ఈఏ 0004’ నెంబర్‌ను  ఎన్.సుధాకర్ అనే వ్యక్తి తన హోండా యాక్టీవాకు తీసుకున్నారు. కొత్త సిరీస్ ప్రారంభమైనప్పటికీ వాహనదారుల్లో సరైన అవగాహన లేక ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ కనిపించలేదు. సాధారణ ఫీజులు, తత్కాల్ ఫీజులపైనే  వాహనదారులు తమకు కావలసిన నెంబర్లను దక్కించుకున్నారు. ‘టీఎస్09 ఈఏ 369’ కోసం ఓ వాహనదారుడు రూ.70 వేలు వేలం ద్వారా చెల్లించగా ‘టీఎస్ 09 ఈఏ 18’ కోసం మరో వాహనదారుడు రూ.10 వేలు చెల్లించారు.
 
ఫ్యాన్సీ నెంబర్లు సర్కార్‌కే..
 
తెలంగాణ రాష్ర్టంలోని తొలి సిరీస్‌లో ఫ్యాన్సీ నెంబర్లను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. ప్రభుత్వ వాహనాల కోసం వీటిని వినియోగించనున్నట్టు రవాణా అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ‘1, 11, 111, 6, 66, 666, 9, 99, 999’ వంటి నెంబర్లు సర్కార్ వాహనాలకే సొంతం కానున్నాయి. మొట్టమొదటి సిరీస్ కావడంతో ప్రభుత్వం ఈ నెంబర్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.
 
పాత వాహనాలపై ప్రతిష్టంభన..
 
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనా పాత వాహనాలపై నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం తొలగిపోలేదు. ‘ఏపీ’ నుంచి ‘టీఎస్’కు మారిన దృష్ట్యా అన్ని వాహనాలు తప్పనిసరిగా ఇందుకు అనుగుణంగా నెంబర్ ప్లేట్‌లను సవ రించుకోవాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో జిల్లా కోడ్ నెంబర్లు కూడా మారిపోతాయి. ఈ అంశంపై స్పష్టతకు మరో వారం, పది రోజులు పట్టవచ్చని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ ర ఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు.
 
రంగారెడ్డి పరిధిలో 482 రిజిస్ట్రేషన్లు

 
అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం 482 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ తెలిపారు. అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో 116, ఇబ్రహీంపట్నంలో 174, ఉప్పల్‌లో 93, మేడ్చల్‌లో 99 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు.
 
ఉప్పల్‌లో టీఎస్ 08 సిరీస్..
 
ఉప్పల్: రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం కిక్కిరిసిపోయింది. టీఎస్ 08 ఈఏ 0001, ట్రాన్స్‌పోర్టు వాహనాల సిరీస్ టీఎస్ 08 యూఏ 0001తో ప్రారంభమయ్యాయి. ఉప్పల్ పారిశ్రామికవాడకు చెందిన దోషి జమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరిట ‘టీఎస్ 08 ఈఏ 0001’ నెంబర్‌ను రూ. 50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాడు.  
 
సికింద్రాబాద్‌లో..
 
కంటోన్మెంట్: సికింద్రాబాద్ ఆర్టీఏ పరిధిలో తొలి నెంబర్‌ను హబ్సిగూడకు చెందిన వ్యాపారి శ్రీధర్‌రెడ్డి దక్కించుకున్నారు. విఖ్యాత్ ఇన్‌ఫ్రా పేరిట తీసుకున్న బెంజి కారుకు టీఎస్10ఈఏ 0009 నెంబర్‌కు పోటీ లేకపోవడంతో కేవలం రూ.50 వేలకే  దక్కించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement