పాత జిల్లాలకు పనిదినమే!
నేడు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల పునర్విభజనలో ఆఖరి మార్పులు, చేర్పులకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఆవిర్భావ వేడుకలు, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అంతకు ముందు 11 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో సీఎస్ సమావేశమవుతారు.
దసరా రోజు కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వం కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది. కొత్త జిల్లాల ప్రారంభ రోజున ప్రస్తుతమున్న పది జిల్లాల పాలనా యంత్రాంగం సైతం విధుల్లో ఉండాలని ఆదేశించింది. కొత్త జిల్లాలకు అవసరమైన సమన్వయం, సహకారాలు అందించాలని అధికారులు, ఉద్యోగులకు సూచించింది. నిర్ణీత సుముహూర్తాన రిబ్బన్ కత్తిరించి కలెక్టరేట్ ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు.
కొత్త జిల్లాలకు నియమించిన కలెక్టర్ తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణ ఫైలుపై సంతకం చేస్తారు. అనంతరం సంబంధిత మంత్రి, వీఐపీలు ప్రారంభోత్సవ ఫొటో సెషన్‌లో పాల్గొంటారు. మొదటి ఫైలుపై కలెక్టర్ సంతకం చేయటంతోపాటు తాను బాధ్యతలు స్వీకరించిన సమాచారాన్ని ఫాక్స్ ద్వారా సీఎస్‌కు పంపిస్తారు. అనంతరం కొత్త జిల్లాలకు సంబంధించిన సమాచారం, డివిజన్లు, మండలాలు, జనాభా, మ్యాప్‌లు, ఫొటోలు తదితర విశేషాలతో కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.
కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు ప్రయోజనాలు, కొత్త జిల్లా విశేషాలను విశ్లేషిస్తూ మంత్రులు ప్రసంగిస్తారు. అభివృద్ధి కోణంలో కలెక్టర్ మాట్లాడతారు. కార్యక్రమం అనంతరం ఇదే తరహా ప్రారంభోత్సవాన్ని జాయింట్ కలెక్టర్, ఎస్పీ, డీఎంహెచ్‌వో, డీఈవో తదితర కార్యాలయాల్లో నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం వివిధ కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల్లో మంత్రులు, కలెక్టర్, జేసీ, ఎస్పీ పాల్గొంటారు.