‘ఖాకీ’.. ఏకాకి! | today is homeguard day | Sakshi
Sakshi News home page

‘ఖాకీ’.. ఏకాకి!

Published Sat, Dec 5 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

‘ఖాకీ’.. ఏకాకి!

‘ఖాకీ’.. ఏకాకి!

భరోసా లేని హోంగార్డుల ఉద్యోగాలు
ఎన్నాళ్లయినా ‘వెట్టి’పాట్లే.. పని చేస్తేనే వేతనం
నేడు హోంగార్డుల దినోత్సవం
 మెదక్:
రాత్రింబవళ్లు డ్యూటీ.. ఏళ్ల తరబడి వెట్టి.. అయినా హోంగార్డుల బతుకులకు భరోసా కరువైంది. పోలీస్ కానిస్టేబుల్‌తో సమానమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఉద్యోగ ధీమా లేకుండా పోతోంది.

డిసెంబర్ 6వ తేదీ హోంగార్డుల దినోత్సవం సందర్భంగా హోంగార్డులపై ‘సాక్షి’  ప్రత్యేక కథనం..  
 మెదక్ జిల్లాలో 62 పోలీస్‌స్టేషన్లలో దాదాపు 800 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. అయితే, దాదాపు 20 ఏళ్ల నుంచి పోలీసులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల ‘చలవ’తోనే వీరి జీవితం ఆధారపడి ఉంటోంది. హోంగార్డులకు ప్రత్యేకమైన హక్కులు లేకపోవడంతో ఉద్యోగం గాలిలో దీపమైంది. ట్రాఫిక్, డ్రైవింగ్, లాండ్ అండ్ ఆర్డర్‌తో పాటు అనేక రకాలు విధులు రేయింబళ్లు నిర్వర్తిస్తుంటారు. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లలో వెట్టి చేస్తారనే ఆరోపణలు లేకపోలేదు. ఎన్నేళ్లు అయినా బాస్ ఆర్డర్‌ను తు.చా తప్పకుండా పాటించాలి! లేదంటే ఇంటికి పోవాలి!
 
 2010 నుంచి రిక్రూట్‌మెంట్
 2010లో హోంగార్డుల రిక్రూట్‌మెంట్‌ను ప్రభుత్వం అధికారికంగా కొనసాగించి, రన్నింగ్, లాంగ్ .. హై జంప్, రాత పరీక్షలతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించి విధుల్లో చే రినా.. వీరిని పర్మినెంట్ చేయకపోవడం విడ్డూరం. ప్రస్తుత వేతనం రూ.12,000 మాత్రమే ఇస్తున్నారు. ఏ శాఖలో అయిన 8 గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. కానీ, హోంగార్డులు మాత్రం 24 గంటలూ విధుల్లో ఉండాల్సిందే!

 1946లో వ్యవస్థ ప్రారంభం
 హోంగార్డు వ్యవస్థ 1946 డిసెంబర్ 6న మన దేశంలో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అంత విశిష్టత వీరి ఉద్యోగాలు ఎందుకు  పర్మనెంట్ కావడం లేదో నాయకులకే తెలియాలి. ముఖ్యంగా ఉద్యోగాలను రెగ్యులర్ చేయడంతో పాటు పోలీసులుగా ప్రమోషన్‌లు ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, పీఆర్సీల ద్వారా ఆదుకోవాలని చాలాకాలంగా హోంగార్డులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

 చిన్నప్పటి నుంచి ఇష్టం
 పోలీస్ ఉద్యోగమంటే చిన్నప్పటి  నుంచి ఇష్టం. పోలీసులతో సమానంగా ఉద్యోగం చేయడం గర్వంగా ఉంది. పదేళ్లుగా మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నా. మాపై ప్రభుత్వం దయతలచి రెగ్యులర్ చేయాలి.
                                                        శ్రీనివాస్, హోంగార్డు, మెదక్
 వేతనాలు సరిపోవడం లేదు
 బియ్యం, కూరగాయల రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంది. ప్రభుత్వం మాపై దయతలచాలి. అందరిలాగే మాకూ ప్రమాషన్‌లు ఇవ్వాలి.
                                                        మోతిరాం, హోంగార్డు, మెదక్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement