వాహనాల రిజిస్ట్రేషన్‌ ఈజీ | Vehicle registration is easy | Sakshi
Sakshi News home page

వాహనాల రిజిస్ట్రేషన్‌ ఈజీ

Published Thu, Jul 5 2018 12:28 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Vehicle registration is easy - Sakshi

జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్‌ కోసం తెచ్చిన బైక్‌లను పరిశీలిస్తున్న ఆర్‌టీఏ అధికారులు 

గద్వాల క్రైం: ప్రతి ఒక్కరికీ సొంత వాహనం ఉండాలనే తపనతో ఉన్న కొద్ది మొత్తం డబ్బులతో కొనుగోలు చేస్తారు.. ఇక దానిని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి ప్రత్యేక నంబర్‌ కేటాయిస్తారు. ఆ తర్వాతే రోడ్లపై తిరిగేందుకు అనుమతి వస్తుంది. అయితే కొనుగోలు చేసిన సదరు వ్యక్తి తన వాహనాన్ని వీలైనంత త్వరగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించాలనే ఆత్రుతతో అక్కడికి చేరుకుంటాడు.

అక్కడ అధికారులు, సిబ్బంది వచ్చేసరికి బాగాఆలస్యమవుతోంది. దీంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి  తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యాచరణకు సిద్ధమైంది. త్వరలో వాహన డీల్లర్లకే రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ముందు వాహనదారులు ఆయా కార్యాలయాల వద్ద నిరీక్షించాల్సిన పనిలేదు.

వాహనం కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రిజిస్ట్రేషన్‌తోపాటు హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌తో సహా అన్ని ధ్రువపత్రాలు వీలైనంత త్వరగా యాజమానికి రవాణా శాఖ అధికారులు ఇవ్వనున్నారు. 

జిల్లావ్యాప్తంగా 8 షోరూంలు..

జిల్లాలో గద్వాల, అలంపూర్, అయిజ, ఎర్రవల్లి, శాంతినగర్‌ తదితర చోట్ల ఎనిమిది బైక్‌ షోరూంలు ఉన్నాయి. ప్రస్తుతం సొంత వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ముందుగా ద్విచక్ర వాహనం, కార్లకు అనుమతి ఇవ్వనున్నారు. దీంతో రవాణా శాఖలో సిబ్బందికి పనిభారం తగ్గించడంతో పాటు అవినీతికి ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రోజుకు సగటున 150బైక్‌లు, కార్లు ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు వస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే వాహనదారులు ఇక్కడికి పరుగులు తీసే అవసరం ఉండదు. అయితే ఫ్యాన్సీ నంబర్లకు సంబంధించి మాత్రం ఈ కార్యాలయానికి రావాల్సిందే. వాస్తవానికి వాహనం ఇంజిన్, చాయిస్‌ నంబరును క్షుణ్ణంగా అధికారులు, సిబ్బంది తనిఖీ చేసి కాగితంపై పెన్సిల్‌తో రఫ్‌ చేసి పరీక్షిస్తారు.

అలాగే నంబర్‌ ప్లేట్‌ అమర్చాల్సి ఉంటుంది. దీంతో వారిపై పనిభారం పెరిగింది. అందులోనూ డీలర్లు సంబంధిత ఏజెంట్‌ను కలిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్‌ అవుతుంది. లేనిపక్షంలో వాహనదారు రెండు రోజులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే.

ముందుగా సంబంధిత డీలర్లతో ఒప్పందం మేరకు కొంత నగదును ఏజెంట్లకు చెల్లించాల్సి వస్తోంది. అలాగే కొనుగోలు చేసిన యాజమాని సైతం కార్యాలయం వద్ద అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వీటిన్నంటికీ కొత్త విధానంతో చెక్‌ పడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement