బీమా సరే..ధీమా ఏది?
ప్రీమియం ఇలా..
చెట్టు వయసు రైతు వాటా పరిహారం
515 ఏళ్లు రూ.26 రూ.450
1650 ఏళ్లు రూ.46 రూ.800
జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లాలో ఏటా ప్రకృతి వైపరీత్యాలతో మామిడికి నష్టం వాటిల్లుతున్నా రైతులకు పరిహారం అందడం లేదు. ధీమాగా ఉంటుందని బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు పంట నష్టపోయినా కూడా పరిహారం దిక్కులేకుండా పోయింది. మరోవైపు ఈ ఏడాది మామిడి వాతావరణ బీమాకు డిసెంబర్ 15 ఆఖరు తేదీగా ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
వాతావరణంలో వచ్చే మార్పులతో నష్టం జరిగినప్పుడు పరిహారం పొందేందుకు మూడేళ్లుగా జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వం వాతావరణ బీమా అవకాశం కల్పించింది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా సంస్థ వారు ఈ బీమా చెల్లిస్తున్నారు. ఒక్కో చిన్న చెట్టు(5-15 ఏళ్లు)కు రూ.26, పెద్ద చెట్టు(16-50 ఏళ్లు)కు రూ.46ను రైతు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నారు. రైతులు ఎన్ని చెట్లకు ఎంత ప్రీమియం చెల్లిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అన్ని చెట్లకు, అంత ప్రీమియం చెల్లిస్తాయి. ఒకవేళ పంట నష్టం జరిగితే, నష్టాన్ని బట్టి 5-15 ఏళ్ల చెట్టుకు రూ.450లు, 16 నుంచి 50 ఏళ్ల చెట్టుకు రూ.800 ఇన్సూరెన్సును సంస్థ చెల్లిస్తుంది. ఉద్యానవనశాఖ అధికారుల సహకారంతో బీమా సంస్థకు ప్రీమియం చెల్లించవచ్చు.
మండలం యూనిట్
బీమా ప్రవేశపెట్టినప్పటినుంచి తరచూ నిబంధనల మార్పుతో కొత్త చిక్కులు వస్తున్నాయి. గతేడాది నిబంధనలు పరిశీలిస్తే అధిక లేదా అల్ప వర్షం (15 డిసెంబర్ 2013 నుంచి 28 ఫిబ్రవరి 2014 వరకు), చీడపీడల బెడద వల్ల నష్టం (15 డిసెంబర్ 2013 నుంచి 28 ఫిబ్రవరి 2014 వరకు), రోజువారీ ఉష్ణోగ్రతల్లో తేడాలు (జనవరి 1, 2014 నుంచి మార్చి 15, 2014 వరకు), గాలి దుమారాలు (మార్చి 1, 2014 నుంచి మే 31, 2014 వరకు) వచ్చి పంటను నష్టం చేస్తేనే వాతావరణ బీమా వర్తించే అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ ఇన్సూరెన్సు కంపెనీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ పథకంలో మండలాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. గత సీజన్‌లో కంపెనీ నిర్దేశించిన సమయాల్లో వాతవరణ మార్పులతో మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అయినా పరిహారం మాట ఇప్పటివరకు లేదు.
జాడలేని పరిహారం
మామిడి చెట్లకు వాతావరణ బీమా కింద 2012-13లో 1,031 మంది రైతులు, రూ 52,55,499 ప్రీమియం చెల్లించారు. ఆ ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో చాలా ఎకరాల్లో పంట నష్టపోయారు. ఇందులో 592 మంది రైతులకు రూ.67,55,085 పరిహారం మంజూరైంది. గత సీజన్ 2013-14లో 494 మంది రైతులు రూ.33,55,384 ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించారు. అంతే మొత్తానికి ప్రభుత్వం సైతం బీమా సంస్థకు ప్రీమియం చెల్లించింది. గాలిదుమారాలు, ప్రకృతి వైపరీత్యంతో మామిడి పంటకు గతేడాది కూడా నష్టం వాటిల్లింది. పరిహారం విషయం మాత్రం ఇప్పటికీ తేలలేదు. తాజాగా ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణ బీమా కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
వాతావరణ కేంద్ర నివేదికే ఆధారం
ప్రతీ మండలకేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ లో ఓ వాతావరణ కేంద్రం ఉంటుంది. ఇది ఆ టోమెటిక్‌గా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్‌లో ఉండే వాతావరణ కేంద్రానికి వెళ్తుంది. వర్షపాతం వివరాలు, ఎం డ తీవ్రత, గాలులు ఇతరత్రా వివరాలన్నీ నమోదవుతాయి. అక్కడినుంచి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం వెళ్తుంది. ఈ వాతావరణ కేంద్రాల్లో నమోదయ్యే వివరాల ఆధారంగానే ఇన్సూరెన్స్ వచ్చేది, రానిది ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, నిర్వహణ ఎలా ఉంటుందో తెలియని ఈ కేం ద్రాలు ఎంతవరకు పనిచేస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.