కోల్‌కత: అంబాసిడర్ కార్లు తయారు చేసే హిందూస్తాన్ మోటార్స్ కంపెనీ త్వరలో చిన్న కారును మార్కెట్లోకి తేనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ చిన్న కారును అందిస్తామని కంపెనీ ఎండీ, సీఈవో ఉత్తమ్ బోస్ మంగళవారం చెప్పారు. ఈ చిన్న కారును అంబాసిడర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తామని, సెడాన్ వేరియంట్‌లోనే దీనిని అందిస్తామని వివరించారు. అంబాసిడర్ కారు కంటే పొడవులో తక్కువగా ఉన్నందున ఎక్సైజ్ సుంకం కూడా తక్కువగా ఉంటుందని, ఫలితంగా అంబాసిడర్ ధర కంటే ఈ కొత్త కారు ధర తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు.
ఈ చిన్న కారు పేరును ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. బీఎస్-ఫోర్, అంబాసిడర్ ఎన్‌కోర్ మోడల్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రూ.4.98 లక్షల ధర ఉన్న ఈ అంబాసిడర్ ఎన్‌కోర్‌కు ట్యాక్సీ సెగ్మెంట్ నుంచి ఆర్డర్లు బాగా వస్తాయని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటికే ఈ కారుకు 450 బుకింగ్స్ వచ్చాయని, నెలకు 2,000 కార్లు విక్రయించడం లక్ష్యమని ఉత్తమ్ బోస్ చెప్పారు. ఈ కారులో బీఎస్-ఫోర్ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఏసీ, పవర్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్రోగ్రామ్, టాప్‌గేర్ అంబాసిడర్‌కు ప్రపంచంలోనే ఉత్తమమైన ట్యాక్సీగా అవార్డునిచ్చిన విషయం తెలిసిందే.
అంబాసిడర్ చిన్న కారు వచ్చేస్తోంది..
Published Wed, Sep 25 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
Advertisement