ముందు చక్రాలు విచ్చుకోకుండానే ల్యాండింగ్!
బ్రెజిల్ విమానంలో ల్యాండింగ్ గేర్ వైఫల్యం
వెనక చక్రాలపైనే సురక్షితంగా దింపిన పైలట్
బ్రెజీలియా: బ్రెజిల్‌లో ఓ విమానం ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య చక్కర్లు కొడుతూ ఎట్టకేలకు ముందు చక్రాలు విచ్చుకోకుండానే సురక్షితంగా దిగింది. బ్రెజిల్ రాజధాని బ్రెజీలియాలోని విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అత్యవసర ల్యాండింగ్ అయిన ఎవియాంకా ఎయిర్‌లైన్స్ ఫోకర్ 100 జెట్ విమానంలో సంఘటన సమయంలో ఐదుగురు సిబ్బంది, 49 మంది ప్రయాణికులు ఉన్నారని, అందరూ క్షేమమేనని బ్రెజిలియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. తొలుత బ్రెజీలియాకు చేరుకున్న విమానం విమానాశ్రయంలో దిగాల్సి ఉండగా ముందు చక్రాలు విచ్చుకునేందుకు అవసరమైన హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్ గుర్తించారు.
వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరుతూ కంట్రోల్ టవర్‌కు సమాచారం ఇచ్చారు. తర్వాత విమానంలో ఇంధనం పూర్తిగా ఖర్చు అయ్యేందుకోసం బ్రెజీలియా చుట్టూ చక్కర్లు కొట్టారు. అనంతరం విమానాశ్రయం రన్‌వేపై ముందుభాగాన్ని నేలకు తాకక మునుపే వెనక చక్రాలు నేలను తాకేలా సురక్షితంగా దింపారు. విమానం దిగిపోగానే చుట్టుముట్టిన అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంలో ఒక రన్‌వేను ఇతర విమానాలు దిగకుండా పూర్తిగా మూసివేశారు.