వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా
న్యూఢిల్లీ : ఒబామా కేర్, ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లపై ఇప్పటికే కొరడా ఝళిపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ నిరుద్యోగుల కడుపు కొడుతున్న హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. హెచ్-1బీ వీసాలపై న్యాయబద్ధంగా ఉంటున్న ఇమ్మిగ్రేట్లపైనే కొరడా ఝళిపించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సిద్దమైనట్టు తెలుస్తోంది. దీంతో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి. వైట్హౌస్కు చెందిన నలుగురు ఎగ్జిక్యూటివ్లు రూపొందించిన డ్రాఫ్ట్లు బయటపడ్డాయి. ఈ లీకైన డ్రాఫ్ట్ల్లో '' లీగల్ ఇమ్మిగ్రేషన్ను పరిమితం చేయడం, అమెరికన్ ఉద్యోగాలను, వర్కర్లను రక్షించడం, విదేశీ వర్కర్ వీసా ప్రొగ్రామ్ను బలపర్చడం'' వంటివి ఉన్నట్టు వోక్స్.కామ్ రిపోర్టు చేసింది.
ఈ డ్రాఫ్ట్లోనే విదేశీ విద్యార్థుల పర్యవేక్షణను మెరుగుపర్చాలని ఎగ్జిక్యూటివ్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్-1బీ వీసా హోల్డర్స్కు అనుమతి కల్పిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాలపైన ట్రంప్ వ్యతిరేక బాటలో వెళ్లనున్నట్టు వోక్స్.కామ్ పేర్కొంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్(సీటీఈఎమ్) విద్యార్థులు మరికొన్ని రోజుల పాటు అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తూ రూపొందించిన ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ పొడిగింపుపై కూడా ట్రంప్ కొరడా ఝళిపించనున్నట్టు తెలుస్తోంది.